కియా మోటార్స్ కార్పొరేషన్. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ. ఏపీలోని అనంతపురంలో తన కార్ల యూనిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు అప్పటి చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా రాయితీలు ఇవ్వటంతోపాటు..ఎన్నో వసతులు కల్పించింది. ఓ వైపు పెట్టుబడి కంటే రాయితీలు ఎక్కువ మొత్తంలో ఇస్తూ కూడా ఈ ప్రాజెక్టు గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా గొప్పలు చెప్పుకున్నారు. ఇది తన కృషి వల్లే వచ్చిందని ఊదరగొట్టారు. ప్రతిపక్షంలో ఉండగా..వైసీపీ దీనిపై ఎన్నో విమర్శలు చేసింది. గత ఎన్నికల ప్రచారంలో అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి కియా రావటంలో ప్రధాని మోడీ కృషి ఉంది తప్ప..ఇందులో చంద్రబాబు పాత్రేమీలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలదీ అదే బాట. సోమవారం నాడు అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదివిన కియా లేఖ రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలపటం..తమ ప్రాజెక్టుకు భవిష్యత్ లో సహకారం అడగటం అనేది ఏ పెట్టుబడిదారు అయినా..కంపెనీ అయినా చేస్తుంది.
ఇందులో విచిత్రం కానీ..అనూహ్యం ఏమీ లేదు. కానీ కియా మోటార్స్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో హన్ వూ పార్క్ 2019 జూన్ 13న రాసిన లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ‘అత్యంత గౌరవనీయమైన రెడ్డి ఇంటిపేరు’ అని దక్షిణ కొరియా కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ తన లేఖలో ప్రస్తావించటం ఇక్కడ గమనార్హం. హైదరాబాద్ లో హ్యుండయ్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు సమయంలో 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశామని ఈ లేఖలో ప్రస్తావించారు. ఆ సమయంలో కంపెనీ ఆటోమొబైల్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఏపీలో పెట్టాల్సిందిగా వైఎస్ కోరారని, తమ దీర్ఘకాలిక సంబంధాలు కియా మోటార్స్ నిర్ణయం లో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
అందులో భాగంగానే తొలి ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీలో చంద్రబాబు సర్కారు చేసుకున్న ఒప్పందాలు అన్నీ సమీక్షిస్తున్న తరుణంలో కియా మోటార్స్ ఏమైనా భయపడిందా?. లేక నిజంగానే వైఎస్ 2007లో అడిగితే ఆ మాట ప్లాంట్ శంకుస్థాపన సమయంలో అయినా...లేదా జగన్ ఈ ప్రాజెక్టు వ్యతిరేకించినప్పుడు అయినా చెప్పాలి కదా?. వైఎస్ కోరితేనే మేం పెడుతున్నాం అని. అలా అంటే అప్పుడు చంద్రబాబు సర్కారు రాయితీలు ఎందుకిస్తుందని భయపడ్డారన్న మాట?. ఏపీలో కుల రాజకీయాలు దక్షిణ కొరియా వరకూ పాకాయా?. ఏది ఏమైనా కియా లేఖ మాత్రం ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.