కేశినేని ‘టార్గెట్’ ఎవరు?

Update: 2019-07-14 05:27 GMT

విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఈ మధ్య కాలంలో ట్వీట్ల ద్వారా కలకలం రేపుతున్నారు. ఓ వైపు అధికార పార్టీపై ఎటాక్ చేస్తూనే సొంత పార్టీ నేతలను కూడా వదలటం లేదు. కేశినేని నాని చేసే ట్వీట్ లు చాలా వరకూ క్లారిటీతోనే ఉంటున్నాయి. ఎవరిని టార్గెట్ చేస్తున్నారో స్పష్టంగా తెలిసేది. అయితే ఆదివారం నాడు ఆయన చేసిన ట్వీట్ మాత్రం కొంత గందరగోళంలోకి నెడుతోంది. ఇదే అదనుగా నాని చేసిన తాజా ట్వీట్ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను ఉద్దేశించి అని కొందరు..కాదు కాదు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాని క్లారిటీ ఇస్తే..లేదంటే టీడీపీలో ఎవరైనా స్పందిస్తే కానీ ఈ విషయం తేలేలా లేదు.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విలేకరుల సమావేశం పెట్టి అధికార పార్టీపై విమర్శలు చేయటం కంటే ట్విట్టర్ నే ఎక్కువ నమ్ముకున్నారు. ట్విట్టర్ లో అయితే కామెంట్స్ తప్ప..ప్రశ్నలు అడిగే వారు ఎవరూ ఉండరు. కొద్ది రోజుల క్రితం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యారు. అందుకే టీడీపీ నేతల్లో కన్ప్యూజన్ నెలకొంది. కేశినేని నాని చేసిన ట్వీట్ ఇదే. "నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!" అని వ్యాఖ్యానించారు. కేశినేని తాజా ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

Similar News