కర్ణాటక సర్కారులో కలకలం

Update: 2019-07-06 10:12 GMT

కర్ణాటకలో సంకీర్ణ సర్కారు సంక్షోభంలో పడ్డట్లే కన్పిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరస రాజీనామాలతో కుమారస్వామి సర్కారు పతనం ఖాయం అనే స్పష్టమైన సంకేతాలు కన్పిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఎప్పటి నుంచో బిజెపి కర్ణాటకలో పాగా వేసేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ లో నెలకొన్న అనిశ్చితి తరహా పరిస్థితి బిజెపికి కలసి వస్తోంది. అదే అదనుగా ఆ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే రాజకీయంగా కర్ణాటకలో వాతావరణం హాట్ హాట్ గా ఉంటే సీఎం కుమారస్వామి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఆదివారం రాత్రికి బెంగూరు చేరుకోనున్నారు. ఇటీవలే ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. శనివారం నాడు మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌, రమేశ్‌ జక్కహళ్లిల రాజీనామాలతో కర్ణాటక ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జ్‌ కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్రానికి పంపనుంది. ఎలాగైనా సంకీర్ణ సర్కారును పడగొట్టేందుకు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి..బిజెపి అధికారం చేజిక్కుంచుకునే ఆలోచనలో ఉంది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా బీజేపీ 105, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్పీ 1, ఇతరులు 2 ఉన్నాయి. తాజా రాజీనామాలతో కుమారస్వామి సర్కారుకు కష్టకాలం తప్పేలా లేదని సమాచారం.

Similar News