టీడీపీపై జగన్ ఫైర్

Update: 2019-07-22 10:27 GMT

అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక బిల్లుల ద్వారా సమాజంలోని వెనకబడిన వర్గాలకు పలు ప్రయోజనాల కల్పించేలా చర్యలు తీసుకుంటుంటే సమర్ధించాల్సిందిపోయి అడ్డుతగలటం ఏ మాత్రం సరికాదని..ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షాన్నితాను ఎక్కడా చూడలేదని జగన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వం పలు బిల్లును సోమవారం నాడు సభలో ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పిస్తూ.. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ. ఇక, నామినేషన్‌ పనుల్లోనూ, నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. తీసుకువచ్చిన కీలక బిల్లులను సభ ముందు ఉంచింది. పరిశ్రమల్లోని 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ.. ప్రతిపాదించిన బిల్లును మంత్రి గుమ్మనూరు జయరామ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం కేటాయించాలని ప్రతిపాదించిన బిల్లును మంత్రి మంత్రి శంకర్ నారాయణ సభ ముందు ఉంచారు. నామినేషన్ పనుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ.. ప్రతిపాదించిన బిల్లులను ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చరిత్రలో ఎన్నడూలేనివిధంగా అవకాశాలను కల్పించే దిశగా, మహిళలకు సమాన అవకాశాలు కల్పించే బిల్లులను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేయడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చరిత్రాత్మక బిల్లులను టీడీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా? అని ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

 

 

 

 

Similar News