అసెంబ్లీ సమావేశాల విషయానికి వచ్చేసరికి గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులే జగన్ సర్కారు కూడా చేస్తోంది. టీడీపీతో పోలిస్తే ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు ప్రస్తుతం బాగానే మాట్లాడే అవకాశం వస్తున్నా ‘భాష’ విషయంలో మాత్రం సాక్ష్యాత్తూ జగన్మోహన్ రెడ్డి తీరే తీవ్ర విమర్శల పాలు అవుతోంది. ఏకంగా సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ఉద్దేశించి నీకు బుద్ధి, జ్ణానం ఉందా? అంటూ వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది. అంతే కాదు..అంతకు ముందు సభలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ‘మనిషివి పెరిగావు కానీ..నీకు బుర్ర పెరగలేదు. నీకు బుర్ర మోకాలిలో కూడా లేదు’ వంటి వ్యాఖ్యలు చేశారు. పలుమార్లు పదే పదే ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు జగన్. సాక్ష్యాత్తూ ఓ ముఖ్యమంత్రి సభలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ హావభావాలు కూడా అభ్యంతరకరంగా ఉంటున్నాయని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని..చనిపోయిన తర్వాత తన ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలే పనిచేస్తానని సీఎం జగన్ పలుమార్లు ప్రకటించారు. ప్రజలు ఆమోదిస్తే దీన్ని ఎవరూ కాదనలేరు. టీడీపీ వాళ్ళు చేసినట్లే చేస్తే తనకూ, చంద్రబాబు తేడా ఏమి ఉంటుందని సభలోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఫిరాయింపుల విషయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత టీడీపీ పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సాక్ష్యాత్తూ అప్పటి సీఎం చంద్రబాబు దగ్గర నుంచి అప్పటి మంత్రులు కూడా సభలోనే జగన్ పై తీవ్రమైన, పరుషమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీపరంగా..ఏదైనా అంశాలపై ఉంటే విమర్శలు చేయవచ్చు కానీ శ్రుతి మించి మరీ విమర్శలు చేశారు అప్పటి టీడీపీ సర్కారులో. వీటిని ప్రజలు ఏ మాత్రం ఆమోదించలేదని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయనే చెప్పుకోవాలి. అలాంటిది దీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నానని చెబుతున్న జగన్ అచ్చం టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లే వ్యక్తిగతంగా..అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా రాబోయే రోజుల్లో ఆయనకే నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.