ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా తన భద్రత అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగా తన భద్రత తగ్గించిందని ఆరోపిస్తూ ఏకంగా ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు . ఈ తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ) భద్రతను కొనసాగించాలని నిర్ణయించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన వీఐపీల భద్రత సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మాజీలైనప్పటికీ చంద్రబాబు నాయుడు, ఫరూక్ అబ్దుల్లాలకు ముప్పు ఉందని.. గుర్తించి.. ఆ మేరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో రక్షణ కొనసాగించనున్నారు. అదే సమయంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు.. జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించారు. దేశంలో కేవలం పన్నెండు మందికి మాత్రమే ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ కల్పిస్తుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా.. భద్రతా సమీక్ష కమిటీ.. దీనిపై.. నిర్ణయం తీసుకుంటుంది. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వారికి.. కేంద్ర బలగాలతో పాటు.. రాష్ట్ర బలగాలు కూడా.. ఆ స్థాయికి తగ్గట్లుగా రక్షణ కల్పించాలి. ప్రస్తుతం చంద్రబాబు భద్రతకు సంబంధించిన పిటిషన్ హైకోర్టు విచారణలో ఉంది.