ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. లోకేష్ మొదలుకుని ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, యనమల రామక్రిష్ణుడు ఇలా నేతలు అందరూ సర్కారుపై ఎటాక్ ప్రారంభించారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఏపీ డిఫ్యాక్టో సీఎంలా వ్యవహరిస్తున్నారని యనమల ఆరోపించారు. కోర్టు వాయిదాలకు హాజరయ్యే శుక్రవారం బ్యాచ్ అంతా ఒక కూటమిగా ఏర్పడి టిడిపి నేతలను అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడతారు అని ఆయన వ్యాఖ్యానించారు. తప్పుడు నిర్ణయాలు, దుందుడుకు చర్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెడుతున్నారు. మొత్తం అన్ని శాఖల్లో గత ప్రభుత్వ కార్యకలాపాలపై విచారణకు ఆదేశించడం ద్వారా ఆయా శాఖల్లో అభివృద్ధి, సంక్షేమ పనులు జరగకుండా స్థంభింప చేయడమే ఈ జీవో సారాంశం. అన్నీ విచారిస్తామనడం ద్వారా అభివృద్ది, పేదల సంక్షేమాన్ని నిలిపివేస్తున్నారు.
కాంట్రాక్టర్లు అందరినీ పిలిపించుకుని సెటిల్ చేసుకునేందుకే ఈ విధమైన ఆదేశాలిచ్చారా..? గతంలో కూడా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అన్నింటిపై ఇలాగే విచారణకు ఆదేశించారు. అన్నీ విచారిస్తామని చెప్పి అభివృద్ది, సంక్షేమాన్ని నిలిపేశారు. కాంట్రాక్టర్లు అందరినీ పిలిపించుకుని సెటిల్ చేసుకున్నాక మళ్లీ అన్నింటినీ కొనసాగించారు. కలెక్షన్లు, సెటిల్ మెంట్ల కోసమే తండ్రి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారు. వీట్నింటిని ప్రజలు గమనిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. తండ్రి పాలనలో రాష్ట్రాన్ని లూటి చేసిన వ్యక్తి ‘నో లూటి’ అనడం, రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు అఫిడవిట్ లో సిబిఐ తో పేర్కొనబడిన వ్యక్తి ‘నో కరప్షన్’ అనడం కన్నా హాస్యాస్పద అంశం మరొకటి ఏముంటుంది..? రాజశేఖర రెడ్డి పాలనలో కళంకిత మంత్రులుగా ముద్రపడిన వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లోనూ మంత్రులుగా ఉన్నవారు శ్రీరంగ నీతులు చెప్పడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.