ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సోమవారం నాడు ప్రారంభం అయిన కలెక్టర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు..అవినీతికి సంబంధించిన అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినప్పుడు ప్రతి అధికారి మెహంలో చిరునవ్వు ఉండాలని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా లూటింగ్...అవినీతికి సంబంధించిన పనులు చెపితే ఏ మాత్రం అనుమతించవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత మాత్రం దీన్ని సహించదని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలకు సంబంధించిన పనుల విషయంలో మాత్రం ఎమ్మెల్యేల మాటకు విలువ ఇవ్వాల్సిందేనని తెలిపారు. ఇసుక మాఫియాకు కూడా చరమగీతం పాడాలని..జిల్లాల్లో పేకాట క్లబ్బులను కూడా ఉండకుండా చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అర్హత ఉండే లబ్దిదారులు ఎవరైనా మాకు ఓటు వేశాడా లేదా అన్నది ముఖ్యం కాదు. మా ఎమ్మెల్యేలు ఇవ్వొద్దని చెప్పినా సరే..వాళ్ళకు పథకం ప్రయోజనాలు అందాల్సిందే. అలా అర్హులకు పథకాలు చేరటం వల్లే వాళ్ళు వచ్చే ఎన్నికల్లో తమ నిర్ణయాలను మార్చుకుంటారని పేర్కొన్నారు. ప్రజలు పనుల కోసం ఆఫీసులు చుట్టూ చెప్పులు తిరిగేలా పరిస్తితి ఉండకూడదు. లంచాలు ఇస్తే తప్ప పని అవుతుందనే పరిస్థితి ఉండకూడదన్నారు.
కాంట్రాక్ట్ అంటే అవినీతి అనే పరిస్థితి తెచ్చారని జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ప్రతి పనిలోనూ టెండర్లలో అవినీతి, అక్రమాలు జరిగాయని తెలిపారు. ప్రతి కలెక్టర్ దగ్గర మేనిఫెస్టో ఉండాలన్నారు. రాష్ట్ర చరిత్రలోఎన్నడూలేని రీతిలో 50 శాతం ఓటింగ్ తో...151 సీట్లతో తాము అధికారానికి వచ్చామన్నరు. తన దగ్గర నుంచి కింది స్థాయి వరకూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలని..కలెక్టర్లు కూడా తమ దగ్గర నుంచి కింది స్థాయి వరకూ ఈ విషయంలో పక్కగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారదర్శకత విషయంలో దేశం అంతా ఏపీ వైపు చూసేలా పరిస్థితి ఉండాలన్నారు. అవినీతి, అక్రమాలతో కట్టిన ఓ బిల్డింగ్ లో మనం అందరం కలసి సమావేశం పెట్టుకున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.