మంచు విష్ణు సినిమా వచ్చి చాలా కాలం అయింది. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ‘ఓటర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా..వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా సురభి నటించింది. సినిమా అంతా ‘రాజకీయాల’ చుట్టూనే తిరుగుతుంది. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుక్కు పెళ్ళి చేయాలని ఇండియాకు రమ్మని పోరుతుంటారు తల్లితండ్రులు. అయితే తనకు రావాలని అన్పించినప్పుడే వస్తాను తప్ప..ఇలా పెళ్ళికి మాత్రం రానని తేల్చిచెబుతాడు హీరో. అంతలో ఓ ఎమ్మెల్యే చనిపోవటంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓటు వేయటానికి అమెరికా నుంచి ఇండియా బయలుదేరతాడు గౌతమ్ (మంచు విష్ణు). అలా విమానాశ్రయం నుంచే నేరుగా పెళ్ళి సంబంధం చూడటానికి బయలుదేరతారు. ఇష్టం లేకుండానే బయలుదేరిన పెళ్ళి సంబంధంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంటుంది. తాను ఫేస్ బుక్ లో చూసిన..తనకు నచ్చిన అమ్మాయే పెళ్ళి చూపుల్లో కన్పించటంతో షాక్ కు గురవటం హీరో వంతు అవుతుంది. కానీ తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదని..తాను నచ్చలేదని చెప్పమని కోరుతుంది హీరోయిన్. అయినా సరే అమ్మాయి నచ్చిందని చెబుతాడు హీరో. ఆ క్రమంలోనే హీరోయిన్ కు ఓ యువకుడు లవ్ ప్రపొజ్ చేస్తాడు.
అయితే ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ మంత్రి పోస్టర్ చించి ఫేస్ బుక్ లో వీడియో అప్ లోడ్ చేస్తే పెళ్లి చేసుకుంటానని షరతు విధిస్తుంది. ఈ షరతుకు షాక్ కు గురైన యువకుడు లవ్ వద్దు..ఏమీ వద్దు అంటూ పరార్ అవుతాడు. కానీ ఆ పని గౌతమ్ చేస్తాడు. పట్టణాల్లో ఎవరైనా ఉచితంగా స్థలం ఇస్తే పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది నమ్మిన ఓ వ్యక్తి అత్యంత ఖరీదైన పది ఎకరాలను ప్రభుత్వానికి అందజేస్తారు. అంతే..ఆ కుటుంబంలోని అందరిని హత్య చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసి స్టార్ హోటల్..కన్వెన్షన్ సెంటర్ కట్టాలని ప్లాన్ చేస్తాడు కేంద్ర మంత్రి సంపత్ రాజ్. ఆ స్థలాన్ని తిరిగి ఎలా పేదలకు చేరుస్తాడు..సంపత్ రాజ్ పదవి పొగొట్టడానికి ఉపయోగించిన రీకాల్ అస్త్రమే కీలకాంశాలుగా సినిమా ముందుకు సాగుతుంది. అలాగే రాజకీయ నాయకుల గురించి ఈ చిత్రంలో దర్శకుడు జి కార్తీక్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు కూడా ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా జి కార్తీక్ రెడ్డి రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోసాని ట్రాక్.. అలాగే విష్ణు ఇండియా గురించి చెప్పే సన్నివేశం మరియు కొన్ని కీలకమైన సీన్స్ చాలా బాగున్నాయి.
ముఖ్యంగా ఓటు విలువ గురించి వచ్చే కొన్ని సంభాషణలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుని రాజకీయాలు ఎలా చేయవచ్చనే అంశంపై ఫోకస్ పెట్టారు. మంచు విష్ణు గత చిత్రాలకు భిన్నంగా ‘ఓటర్’ చిత్రం పక్కా పొలిటికల్ డ్రామాగా సాగడం వల్ల అక్కడక్కడ మంచు విష్ణు లుక్స్ లో యాక్షన్ లో ఫ్రెష్ నెస్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. తన చెల్లిని కాపాడుకునే సన్నివేశంలో విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్. కేంద్ర మంత్రి సంపత్ రాజ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలోని అంశాలతో ప్రత్యర్ధులు చేసిన మార్ఫింగ్ వీడియో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఓవరాల్ చూస్తే ‘ఓటర్’ ఓకే సినిమా.
రేటింగ్. 2.5/5