టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

Update: 2019-06-28 16:27 GMT

రాజకీయంగా ఇది టీడీపీకి కష్టకాలమే. ఎందుకంటే పార్టీ నేతలు వరస పెట్టి జంప్ అవుతున్నారు. ఈ సీన్ రాబోయే రోజుల్లోనూ ఇలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల సూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ వరదాపురం సూరి శుక్రవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్‌ నేత రాంమాధవ్‌ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు.

2014 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచిన సూరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బిజెపిలో చేరటానికి ముందు ఆయన టీడీపీ జిల్లా ప్రధాన కార‍్యదర్శి పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. అనివార్య కారణాల వల్ల తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో కోరారు.

 

Similar News