ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ పై టార్గెట్ మొదలైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ రంగ డెయిరీలను నిర్వీర్యం చేసి సొంత కంపెనీ మేలు కోసం పనిచేశారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందులో చాలా వరకూ నిజం ఉందని టీడీపీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తారు. ప్రభుత్వ రంగంలోని డెయిరీలు నష్టాల ఊబిలోకి కూరుకుపోగా...చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం ఓ వెలుగు వెలిగింది. కానీ ఏపీలో ఇప్పుడు కీలక మార్పులు జరిగాయి. చంద్రబాబు దారుణ ఓటమిని చవిచూడగా..భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఏపీకీ అత్యంత కీలకమైన నూతన రాజధాని అంటే..శాశ్వత భవనాల నిర్మాణంపై కూడా కొత్త సీఎం జగన్ ఇంత వరకూ ఫోకస్ పెట్టలేదు. మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే రివ్యూ చేశారు కానీ..సీఎం మాత్రం రాజధాని శాశ్వత భవనాల అంశంపై రివ్యూ చేయలేదు. ఇప్పుడు జగన్ సడన్ గా ఏపీలో డెయిరీ రంగం ప్రగతిపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి సంబంధించి విధివిధానాల కసరత్తు కోసం మంత్రి పెద్దిరెడ్డి తోపాటు వినుకోండకు చెందిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తదితరులతో కమిటీ వేసే యోచనలో ఉన్నారు. బ్రహ్మానాయుడు సలహాలు, సూచనలు తీసుకోవాలని జగన్ సూచించారు. రైతులకు మరింత మేలు చేకూర్చే దిశగా అడుగులు వేస్తూ టార్గెట్ హెరిటేజ్ గా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాల సేకరణతో పాటు అంశాల్లో అధిక రేటు ఇస్తే రైతులు హెరిటేజ్ కు గుడ్ బై చెప్పి సర్కారు డెయిరీల వైపు మళ్లటం ఖాయం. ఇది హెరిటేజ్ ఫుడ్స్ కు కోలుకోలేని దెబ్బ అవుతుందని..ఇంత త్వరగా జగన్ డెయిరీ రంగంపై ఫోకస్ పెట్టారంటే అందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబు కంపెనీ అయిన హెరిటేజ్ ను దెబ్బతీయటం. రైతులకు అధిక రేటు ఇవ్వటం ద్వారా వారి ఆదరణ దక్కించుకోవటం. దీని వల్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదనే అంచనాతో వైసీపీ ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.