ఓ పోలీసు స్టేషన్. అమ్మాయిలు వరస పెట్టి తమ భర్త మిస్ అయ్యాడంటూ స్టేషన్ గడపతొక్కుతుంటారు. అమ్మాయిలు వేర్వేరు. కానీ అందరి భర్త ఒక్కడే. అసలు ఏంటి ఈ మిస్సింగ్ కథ. పోలీసులకు ఓ పెద్ద సస్పెన్స్ ఇది. స్టోరీ అంతా పోలీస్ స్టేషన్ నుంచే నడిపిస్తారు. అన్నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలే. హీరో హవీష్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కన్పిస్తాడు. ఒకటి కార్తీక్ గా..మరొకటి కృష్టమూర్తిగా. సినిమాలో చాలా మంది హీరోయిన్లను పెట్టినా వాళ్ళ పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయే తప్ప...ఏ పాత్ర ప్రేక్షకుల మనస్సుల్లో గుర్తుండిపోయేలా లేదు. కాస్తో కూస్తో రెజీనా పాత్రే నెగిటివ్ షేడ్స్ తో ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. కార్తీక్ (హవీష్) రమ్య (నందితా శ్వేతా)ల లవ్ ట్రాక్ ను దర్శకుడు అత్యంత అంటే అత్యంత నాసిరకంగా తెరకెక్కించాడు. ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపటం..అది యాక్సెప్ట్ చేయటం..తర్వాత పార్కుల్లో తిరగటంతోనే వీళ్ళ లవ్ ట్రాక్..పెళ్ళి పూర్తవుతుంది. ఇందులో అటు నటులు కానీ..ఇటు సినిమా చూసిన ప్రేక్షకులు కానీ ఏ మాత్రం ‘ఫీల్’ అవరు. ఈ లవ్ ట్రాక్ కు ఎండ్ పడి..కేసుల పోలీస్ స్టేషన్ కు తిరిగిన తర్వాతే సినిమాలో కొంత ఉత్సుకత పెరుగుతుందనే చెప్పొచ్చు.
సినిమా ఫస్టాఫ్ అంతా చాలా బోరింగ్ గా సాగుతుంది. ఫస్టాఫ్ చివరిలో అసలు కథ మొదలవుతుంది. ఓ గ్రామంలో నాటకాలు వేస్తూ ఉంటాడు కృష్ణమూర్తి(హవీష్). ఆయన నాటకాలు ఎంతో ఇష్టం పెంచుకున్న జమీందారు కూతురు అయిన సరస్వతి (రెజీనా) ఆయనపై ప్రేమ పెంచుకుంటుంది. తానే ఊరంతా తామిద్దరం ప్రేమించుకున్నట్లు ప్రచారం చేస్తుంది. కానీ కృష్ణమూర్తి అప్పటికే ఓ అమ్మాయితో ప్రేమలో ఉండి..ఆమెను పెళ్ళి చేసుకోవటానికి కూడా రెడీ అయిపోతాడు. కానీ సరస్వతి తన పెళ్ళికి అడ్డు చెప్పాడని తండ్రిని కూడా చంపేస్తుంది. గుడిలో బలవంతంగా పెళ్లిచేసుకున్న కృష్ణమూర్తి లోయలో దూకి చనిపోతాడు. కానీ పట్నంలో ఉంటున్న కార్తీకే కృష్ణమూర్తి అని భావించిన సరస్వతి ఓ ప్రమాదం నుంచి కాపాడిన అమ్మాయిలతో ఓ నాటకం ఆడిస్తుంది. ఈ సినిమాలో ట్విస్ట్ లు..యాక్షన్ లు చూసి ప్రేక్షకుల హాహాకారాలు చేసిన పరిస్థితి కన్పించిందనే చెప్పొచ్చు.
దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి స్వయంగా కథ అందించి నిజార్ షఫీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ 7(సెవెన్) సినిమాను తెరకెక్కించాడు. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు ఉన్నా ఏమీ వారి పాత్రలు ఏమీ ఆకట్టుకునేలా లేవు. సినిమాలో నటనపరంగా పరిణితి చూపించిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు రెజీనా, పోలీస్ ఆఫీసర్ గా కన్పించిన రెహమాన్ లు మాత్రమే అని చెప్పొచ్చు. దర్శకుడిగా తడబడినా సినిమాటోగ్రాఫర్‌గా మాత్రం నిజార్ షఫి మంచి మార్కులు దక్కించుకున్నాడనే చెప్పొచ్చు. హీరో హవీస్ ఓ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేయలేకపోయాడు. ఓవరాల్ గా చూస్తే సెవెన్ మూవీ ప్రేక్షకుల సహనానికి పరీక్షలాంటిదే.
రేటింగ్. 2/5