తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్. ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరి మధ్య ఎంత తేడా?.జగన్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ‘ప్రజా దర్బార్’ నిర్వహించటానికి రెడీ అయిపోయారు. ప్రతి రోజూ ఓ గంట ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించటానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ సీఎం కెసీఆర్ మాత్రం ప్రగతి భవన్ లో ఇదే తరహా కార్యక్రమం చేపడతానని ప్రకటించారు. తర్వాత ఆ సంగతే వదిలేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటీఆర్ అయితే ఓ అడుగు ముందుకేసి అసలు సీఎంను ప్రజలు కలవాల్సిన పనేముంది?. సీఎం దగ్గరకు ప్రజలు వచ్చారంటే అది పాలనా వైఫల్యమే అని వ్యాఖ్యానించారు. సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు జమానాలో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చటానికి ఏపీ సీఎం జగన్ మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ నిగ్గుతేల్చే విషయాల ఆధారంగా భవిష్యత్ చర్యలు ఉండబోతున్నాయని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ జమానాలో హౌసింగ్ స్కామ్ జరిగిందని..ఇందులో 300 కోట్ల రూపాయలపైనే అవినీతి జరిగిందని సాక్ష్యాత్తూ సీఎం కెసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఏసీబీ నివేదిక కూడా ఉందని ప్రకటించారు. దీనిపై చర్యలు తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపులు అంటారని వదిలేశామని..రెండోసారి గెలిచాక మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. కానీ చేతిలో నివేదిక పెట్టుకుని ఆ స్కామ్ కు పాల్పడిన వారిని అలాగే వదిలేశారు. దీని ద్వారా కెసీఆర్ ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతున్నట్లు?. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాదు ఫిరాయింపుల విషయంలో కూడా జగన్, కెసీఆర్ ల మధ్య చాలా తేడా ఉంది.
ఓ వైపు కెసీఆర్ తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేస్తే...జగన్ మాత్రం ఎవరు తమ పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనంటూ అసెంబ్లీ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. జగన్, కెసీఆర్ ల స్నేహంతో ఇప్పుడు ప్రతి అంశంలో పోలిక వస్తుందని చెబుతున్నారు. గతంలో కెసీఆర్, జగన్ లు ఒకరిపై ఒకరు పరస్పర తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. కారణాలు ఏమైనా ఇఫ్పుడు ఇద్దరూ కలసి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెబుతున్నారు.