జగన్ కేబినెట్ కొలువుదీరింది

Update: 2019-06-08 08:09 GMT

ఒకేసారి 25 మంది మంత్రులు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం శనివారం కొలువుదీరింది. ఎవరూ చేయనిరీతిలో కేబినెట్ లో ఉన్న ఖాళీలు అన్నీ ఒకేసారి భర్తీ చేసి జగన్ ఓ కొత్త రికార్డు నెలకొల్పారు. అంతే కాదు..సామాజిక సమీకరణల విషయంలో కూడా రాజకీయంగా ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు. ఏకంగా ఒకేసారి ఐదుగురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటం కూడా కొత్త చరిత్రే అని చెప్పకతప్పదు. శనివారం నాడు అమరావతిలో కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత మంత్రుల ప్రమాణ స్వీకారం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారు. తొలుత ధర్మాన కృష్ణదాస్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ తర్వాత బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్, ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణారావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరామ్,, షేక్ బేపారి అంజాద్ బాషా, మాలగుండ్ల శంకర నారాయణలు వరసగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొత్త మంత్రులతో కలసి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు తేనీరు సేవించటంతో ఈ కార్యక్రమం ముగిసింది.

 

 

Similar News