‘హిప్పీ’ మూవీ రివ్యూ

Update: 2019-06-06 10:58 GMT

తొలి సినిమాతోనే టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు హీరో కార్తికేయ. ఆయన నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఒక హీరో..ఏ ఫార్ములాతో హిట్ కొట్టాడో..అదే ఫార్ములాను పదే పదే వాడటం టాలీవుడ్ కు బాగా ఆలవాటు అనే చెప్పొచ్చు. ఎంత అందంగా ఉన్నా..అభినయం అద్భుతంగా ఉన్నా ఓ సారి చెల్లి పాత్ర చేస్తే ఆమె ఇక జీవితాంతం చెల్లి పాత్రకే పరిమితం అయిపోవాల్సిందే. అలా తొలిసారి ఎలాంటి పాత్రల్లో కన్పిస్తారో..అలాంటి పాత్రల్లోనే వాళ్ళను ‘ఫిక్స్’ చేస్తారు. తొలి సినిమాలో కార్తికేయ తన బాడీతో అమ్మాయిని పడేయగా..రెండవ సినిమాలోనూ ఇంచుమించు అదే తరహాలో బాడీ ప్రదర్శన ఉన్న పాత్రనే తెరకెక్కించారు. అయితే చాలా చోట్ల కార్తికేయ డ్యాన్సులతో పాటు...నటనలోనూ తన సత్తా చాటారనే చెప్పొచ్చు.. కథ అలా ఉందే తప్ప..ఈ సినిమా విషయంలో కార్తికేయను తప్పుపట్టాల్సిన అవసరం కనపడదు. అయితే సినిమా ఎంపిక అన్నది ఆయన ప్రాధాన్యతే. అయినా ఇప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఓ యువ హీరో నేను ఈ కథ చేయను అని చెప్పే సాహసం చేస్తాడు అనుకోవటం కూడా అత్యాశే అవుతుంది. అందుకే ఈ సినిమా చేసినట్లు కన్పిస్తోంది.

హిప్పీ సినిమాలో కార్తికేయ ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ‘ప్లేబాయ్’లా ఉంటాడు. తొలుత స్నేహ (జజ్బా సింగ్) అనే అమ్మాయితో రొమాన్స్ చేస్తాడు. స్నేహతో కలిసి గోవాకు వెళుతున్న సమయంలోనే ఆమె ఫ్రెండ్‌ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి మనసు పారేసుకుంటాడు. అప్పటి నుంచి తన ప్రేమను తెలిపే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. తన ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయి ఉండి తనకు లవ్ ప్రపొజ్ ఎలా చేస్తావంటూ ఆముక్తమాల్యద ప్రశ్నించటం..తన మనసులో మాటను హిప్పీ బహిర్గతం చేయటంతో సినిమాలో ఎన్నో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉంటాయి. పెళ్లికి ముందు ఇద్దరూ కలసి సహజీవనం చేస్తారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగే ఘర్షణ ఆసక్తికరంగా ఉంటుంది.

హీరోయిన్‌ దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద పాత్రలో ఆకట్టుకుంది. నటనతో పాటు గ్లామర్‌ షోతోను యూత్‌ ఆడియన్స్‌ ను కట్టిపడేసిందనే చెప్పొచ్చు. మరో కీలక పాత్రలో నటించిన జేడీ చక్రవర్తి, తన అనుభవంతో అరవింద్‌ పాత్రను అవలీలగా పోషించాడు. వెన్నెల కిశోర్‌ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. కథ పరంగా ఓకే అన్పించేలా ఉన్నా కథనం మాత్రం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌ కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఫ్యామిలీ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. అయితే హిప్పీ సినిమాను కేవలం యూత్ ను టార్గెట్ చేసినట్లు స్పష్టం గా కనపడుతోంది.

రేటింగ్. 2.25/5

 

Similar News