విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతానికి భిన్నంగా ఆయన గత కొంత కాలంగా నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా జగన్ సర్కారుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘అమరావతిని కూల్చేద్దాం. హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దాం’ అనేలా ఏపీ సీఎం జగన్ వైఖరి ఉందని విమర్శించారు. ఈ పోస్టుకు తాజాగా కూల్చేసిన ప్రజావేదిక, విజయవాడ నుంచి ఆగిపోయిన సింగపూర్ విమానాలు, జగన్, కెసీఆర్ ఫోటోలను జత చేశారు.
పొరుగు రాష్ట్రంలో స్నేహ సంబంధాలు మంచిదే అంటూనే..ఈ స్నేహం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో చెప్పాలని కేశినేని శనివారం నాడు మరో పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల వరకూ ఎదురు డబ్బులు ఇచ్చి మరీ తెలుగుదేశం ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులు నడిపించింది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీజీఎఫ్ స్కీమ్ కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో ఇండిగో ఎయిర్ లైన్స్ సింగపూర్ సర్వీసులకు బ్రేకులు వేసింది.