ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న ప్రాంతం అక్రమం అంటూ సీఆర్ డీఏ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నివాసంతోపాటు మరో 28 మందికి కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ లింగమేని రమేష్ కుటుంబానికి సంబంధించినది. అయితే ఈ అంశానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండగా..ఇప్పుడు సీఆర్ డీఏ ఆగమేఘాల మీద నోటీసులు ఇవ్వటాన్ని టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరిత చర్యలే అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపిస్తున్నారు. ఇదే టీడీపీ నేతలు ప్రజావేదికను అయితే కూల్చారు...ఇంకా ఇక్కడే ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చగలరా? అని సవాల్ విసిరారు.
మళ్ళీ ఇప్పుడు సర్కారు నోటీసులు ఇస్తే మాత్రం రాజకీయం అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. చంద్రబాబు ఉంటున్న నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్‌డీఏ సెక‌్షన్ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.