టాలీవుడ్ లో అప్పుడప్పుడు ‘కథే’ హీరోగా సినిమాలు హిట్ లు కొట్టేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగానే పెరిగిందనే చెప్పొచ్చు. ఎక్కడి వరకో ఎందుకు తాజాగా వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ కూడా ఇందుకు ఓ ఉదాహరణ. ఇప్పుడు అదే జాబితాలో చేరింది ‘బ్రోచేవారెవరురా’ మూవీ. కథ మరీ కొత్తది ఏమి కాకపోయినా కథ చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద హీరోలు...స్టార్ ఇమేజ్ ఉన్న వారు ఎవరూ లేకపోయినా బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారటానికి ఉదాహరణలు ఎన్నో. శ్రీ విష్ణు. నివేదా థామస్. ఇద్దరికి ఇద్దరూ ఈ సినిమాలో మంచి నటనతో దుమ్మురేపారనే చెప్పొచ్చు. శ్రీ విష్ణు విభిన్న చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. నివేదా థామస్ కూడా అంతే. అటు వాణిజ్య చిత్రాల్లో నటిస్తూనే..కథా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ సత్తా చాటుకుంటున్నారు. కథ డిమాండ్ చేయాలి కానీ..దర్శకుడు కోరినంత నటన ఇవ్వటానికి ఆమె రెడీ. బ్రోచెవారెవరురా సినిమా అదే విషయాన్ని నిరూపించింది.
ఓ అమ్మాయి ఇష్టాలు. వాటిని డామినేట్ చేసేలా చేసే తండ్రి ఆంక్షలు. ఈ మధ్యలో జరిగే సంఘర్షణ. అంతే కాదు..సమాజంలో ఆమెకు ఎదురయ్యే వేదింపులు. ఇలాంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. మిత్ర పాత్రలో నివేదా థామస్ అద్భుతంగా నటించింది. తండ్రి ప్రేమకు దూరమైన మిత్ర క్యారెక్టర్‌లో నివేదా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే అల్లరి చిల్లరగా తిరిగే రాహుల్ పాత్రలో శ్రీ విష్ణు మెప్పించాడు. తనకు అలవాటైన నటనతో రాహుల్ పాత్రలో ఈజీగా జీవించేశాడు. సినీ హీరోయిన్ షాలినీగా నివేధా పేతురాజ్, డైరెక్షన్ కోసం ప్రయత్నించే విశాల్‌గా సత్యదేవ్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. శ్రీ విష్ణు స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గుర్తుండే పాత్రలో నటించారు. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు మెప్పించారు. ఓ చిన్న పాయింట్‌ను తీసుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ.. తను అల్లిన కథ, కథనాన్ని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. చిత్రంలో జరిగే ప్రతీ సన్నివేశానికి.. మళ్లీ ఎక్కడో లింక్ చేసి రాసిన కథనానికి కనెక్ట్ చేయటంలో దర్శకుడి ప్రతిభ కనపడుతుంది. మిత్ర పాత్రలో అమ్మాయి పడే కష్టాలను చూపిస్తూనే.. తండ్రి అనే వాడు ఎలా ఉండకూడదో చూపించాడు.
ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచించేలా చేశాడు. కథనం స్లోగా నడస్తున్నా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ చేయకుండా.. తను అనుకున్న కథను, తను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు విసుగు రాకుండా చెప్పాడు. థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడిని పడిపడి నవ్వేలా చేసిన వివేక్.. కొంచెంకొంచెంగా అసలు పాయింట్‌ను చెబుతూ ఉంటాడు. చివరకు ఓ అమ్మాయికి తల్లిదండ్రులు, ఇళ్లే సురక్షితమని ముగించేస్తాడు. ఈ కథలో తిప్పిన ప్రతీ మలుపు ఆసక్తికరంగా ఉండటం, ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ ను ఎక్కడా వదలకపోవడంలోనే వివేక్ పనితనం అర్థమవుతోంది. ఓవరాల్ గా చూస్తే ‘బ్రోచెవారెవరురా’ ఓ మంచి సినిమా.
రేటింగ్:3/5