టీడీపీలో ‘అనగాని’ కలకలం!

Update: 2019-06-26 16:29 GMT

నేతల ప్రతి కదలికా ఇప్పుడు అనుమానంగానే మారింది. నేతలు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళినా అది బిజెపిలో చేరటానికేనా? అన్న అనుమానాలు. నిజంగా ఏపీ, తెలంగాణల్లో రాజకీయ వాతావరణం అలాగే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా రండి బాబూ రండి..ఆలశ్యం చేస్తే ఆశాభంగం అన్న తరహాలో వలసలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఏపీలో దారుణంగా దెబ్బతిన్న టీడీపీ నేతలను బిజెపి టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, ఓ మాజీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి ఇప్పటికే బిజెపి గూటికి చేరిపోయారు. ఈ తరుణంలో గుంటూరు జిల్లా రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీ వెళ్ళిన వ్యవహారం రాజకీయంగా పెద్ద కలకలమే రేపింది.

అనగాని సత్యప్రసాద్‌ కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు...పార్టీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం అయితే సాగింది. అయితే అనగాని సత్యప్రసాద్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. తాను అమిత్ షాను కలిసినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. తమ కుటుంబ మిత్రుడు గరికపాటి మోహన్ రావు అనారోగ్యంతో ఉండటంతో ఆయన్ను పరామర్శించేందుకే ఢిల్లీ వెళ్ళాలని తెలిపారు. అదే సమయంలో తాను ఢిల్లీ వెళుతున్న విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పి మరీ వచ్చానని వెల్లడించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళటం ఏ మాత్రం సరికాదన్నారు అనగాని.

 

 

 

Similar News