పవన్ కళ్యాణ్ కు ‘ప్యాకప్’ చెప్పిన ఏపీ ప్రజలు

Update: 2019-05-24 03:34 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఏపీ ప్రజలు ‘ప్యాకప్’ చెప్పేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ‘టైం పాస్’ రాజకీయాలు చేసిన ఆయనకు ఫలితాలు కూడా అదే తరహాలో వచ్చాయి. ఏకంగా ఈ జనసేనాని పోటీచేసిన భీమవరం, గాజువాక సీట్లలోనూ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. జనసేన ఏపీలో ఒక్కటంటే ఒక్క రాజోలు సీటును మాత్రం గెలుచుకోగలిగింది. తొలి సారి పార్టీ పెట్టి చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత చాలా కాలం మౌనంగా ఉండి..సరిగ్గా ఎన్నికలకు కొద్ది కాలం ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు.

అంత వరకూ బాగానే ఉన్నా..తర్వాత కాలంలో అధికార టీడీపీ కంటే ప్రతిపక్ష వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరైనా అధికార పార్టీతో పోరాడతారు కానీ..పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా ప్రతిపక్షంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని వైసీపీ చేసిన ప్రచారం కూడా ప్రజల్లోకి బాగానే వెళ్లింది. వాటి ఫలితమే పవన్ కళ్యాణ్ కు ఈ చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఓటమిపై స్పందించిన పవన్ తాను రెండు చోట్ల ఓటమి పాలైనా పెద్దగా పట్టించుకోనని..తాను కోరుకున్న లక్ష్యాల కోసం పనిచేస్తానని..రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో.

 

Similar News