పాదయాత్ర కేరాఫ్ ‘పవర్’

Update: 2019-05-23 07:24 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. గత కొంత కాలంగా ఏపీలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. పాదయాత్ర చేస్తే ‘పవర్’ ఖాయం అనే పరిస్థితి వచ్చింది. అంటే ఎవరు పడితే వారు పాదయాత్ర చేస్తే అధికారం వస్తుందనుకోవటం మళ్ళీ భ్రమే అవుతుంది. రాజకీయంగా బేస్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది సాధ్యం. తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో 2004కు ముందు మండుటెండల్లో పాదయాత్ర చేసి..ప్రజలకు చేరువయ్యారు దివంగత రాజశేఖరరెడ్డి. ఆయన చేసిన పాదయాత్రే రాజశేఖరరెడ్డిని అప్పట్లో ముఖ్యమంత్రిని చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్రకు తోడు అప్పటికే చంద్రబాబుపై పేరుకుపోయిన వ్యతిరేకత కూడా వైఎస్ కు కొంత కలిసొచ్చిందనే చెప్పొచ్చు. వైఎస్ విజయ ప్రస్థానంలో ‘పాదయాత్ర’ ఓ మైలురాయి అని చెప్పకతప్పదు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రపై కొన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టారు.

రాష్ట్ర విభజన తర్వాత అనుభవం ఉన్న నేతగా ఆయనకు కాలం కలిసొచ్చింది. ఇక ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓ రికార్డుగానే చెప్పుకోవచ్చు. జగన్ 134 నియోజకవర్గాలలో 3,500 పాదయాత్ర చేసి కోట్లాది మంది ప్రజలను కలుసుకోవటం ద్వారా పెద్ద ‘ఇంప్యాక్ట్’ చూపించగలిగారు. ప్రస్తుత జగన్ గెలుపులో పాదయాత్ర పాత్ర ఎంతో కీలకం అని చెప్పకతప్పదు. పాదయాత్రతో నిత్యం ప్రజల్లో ఉండటం ద్వారా జగన్ అధికార తీరాలకు చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. పాదయాత్ర చేస్తే ‘పవర్’ ఖాయం అనే విషయాన్ని జగన్ మరోసారి నిరూపించినట్లు అయింది.

 

Similar News