టీడీపీలో లోకేష్ వ్యాఖ్యల కలకలం

Update: 2019-05-28 07:35 GMT

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ‘ ఈవీఎంలు పది శాతం మోసం చేస్తే చంద్రబాబును మోసం చేసింది 90 శాతం నేతలే. గల్లా వంటి నేతలు గెలవగా మిగిలిన వారు ఎందుకు ఓడిపోయారో ఆలోచించుకోవాలి. 2024లో అమరావతిలో టీడీపీ జెండా ఎగరేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటాను. టీడీపీ శ్రేణులకు దాడులు చేస్తే ఊరుకునేది లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి టీడీపీకి పునర్ వైభవం సాధించేలా చూడాలి.’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

మరి మంగళగిరిలో ఓటమి పాలైన నారా లోకేష్ కూడా చంద్రబాబును మోసం చేసినట్లేనా? అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నారా లోకేష్ వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉండటంతో టీడీపీ కూడ వెంటనే స్పందించింది. నారా లోకేష్ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని..కొంత మంది కార్యకర్తలు ఓటమి పై ఆవేదనలో అలా మాట్లాడారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే లోకేష్ వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా రావటంతో పార్టీలో పెద్ద దుమారం రేపింది. ఏపీ ఎన్నికల్లో సీనియర్‌ నేతలతో సహా, మంత్రులు కూడా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.

 

 

Similar News