విన్నపాలు వినవలె

Update: 2019-05-26 06:48 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం అనంతరం ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఢిల్లీ వెళ్ళారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నరేంద్రమోడీ నివాసానికి వెళ్ళి ఆయనతో సమావేశం అయ్యారు. ఇది మర్యాద పూర్వక భేటీ అయినా కూడా పలు అంశాలను జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా పోలవరానికి అదనపు ఆర్థిక సాయం, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవటం వంటి అంశాలపై మోడీకి జగన్ ఓ వినతిపత్రం అందజేశారు.

జగన్ తోపాటు ఆ పార్టీ ఎంపీలు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఈ టీమ్ లో ఉన్నారు. ప్రధాని మోడీని తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా కూడా జగన్మోహన్ రెడ్డి కోరారు. సుమారు గంట పాటు మోడీ, జగన్ ల భేటీ సాగింది. జగన్ ను ఆలింగనం చేసుకుని మరీ మోడీ పలుమార్లు భుజం తట్టారు. మోడీని కలసిన బృందంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేష్, అవినాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

Similar News