కెసీఆర్ కు స్టాలిన్ రివర్స్ ఝలక్ !

Update: 2019-05-14 04:12 GMT

అనుకున్నది ఒకటి. అయింది ఒకటి. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ కు డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ రివర్స్ ఝలక్ ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ లేదా..ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా స్టాలిన్ ను ఒప్పించేందుకు కెసీఆర్ ప్రయత్నం చేయగా..స్టాలిన్ మాత్రం రివర్స్ స్ట్రాటజీ ఉపయోగించారు. తాము కాంగ్రెస్ తో కలసే ముందుకు సాగుతామని..ఇందులో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించారు. దీంతో కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు తమిళనాడులో చుక్కెదురు అయినట్లు చెప్పొచ్చు. అంతే కాదు..కెసీఆర్ ను కూడా కాంగ్రెస్ కూటమిలోకి రావాల్సిందిగా డీఎంకె అధినేత స్టాలిన్ కోరినట్లు ఆ పార్టీ నేత ఒకరు ట్విట్ చేసి కలకలం రేపారు. అందుకే స్టాలిన్ తో భేటీ అనంతరం కెసీఆర్ మీడియాతో మాట్లాడకుండానే వెనక్కి వచ్చేశారు. సహజంగా ఎంతో కీలకమైన ఇలాంటి రాజకీయ భేటీలు జరిగినప్పుడు రెండు పార్టీల నేతలు మీడియా ముందు మాట్లాడటం ఆనవాయితీ.

గతంలో ఇలాగే పలుమార్లు చేశారు కూడా. కానీ ఇప్పుడు కెసీఆర్, స్టాలిన్ మీడియా ముందుకు సంయుక్తంగా రాకపోవటంతో విషయం స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ కెసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు ఒక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరూ ఆసక్తి చూపలేదనే చెప్పొచ్చు. కేంద్రంలో ఈ సారి బిజెపికి కూడా భారీ షాక్ తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా ఈ సారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే హవా ఉండే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తమ దగ్గర ఉండే నెంబర్ల ఆధారంగా ఆట ప్రారంభించాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఎవరి ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

 

Similar News