ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ చిన్న వయస్సులోనే సీఎం అయ్యారని..ఆయన ముందున్నది ఇప్పుడు పెద్ద బాధ్యత అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభికులనుద్దేశించి కెసీఆర్ మాట్లాడారు. కెసీఆర్ మాట్లాడేందుకు లేవగానే ప్రజలు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని తెలంగాణ చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తెలుగు ప్రజల జీవన గమనంలో ఉజ్వల ఘట్టమని వర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అంటూ ప్రసంగాన్ని కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగల అభినివేశం, శక్తి, సామర్థ్యం ఉందని గత 9 ఏళ్లుగా జగన్ నిరూపించారని అన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ముఖ్యమంత్రి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు కరచాలనం అని పేర్కొన్నారు. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు.