చాలా కాలం నుంచి ‘కథే’ హీరోగా మారుతోంది. కథలో దమ్ము ఉంటే అక్కడ ఎవరు ఉన్నారన్నది కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోవటం లేదు ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. అందులో కొన్ని హిట్ అవుతున్నాయి..మరికొన్ని ఫట్ మంటున్నయి. తాజాగా యువ హీరో విశ్వక్ సేన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమానే ‘ఫలక్ నుమా దాస్’. పేరులోనే మాస్ యాంగిల్ కూడా ఉంది. సినిమాలో కూడా అంతే. ఫలకు నుమా ఏరియా. గల్లీలు..దందాలు..ఫైటింగ్ లు. లోకల్ డైలాగ్ లు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ రీమేక్ రైట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు, హీరో విశ్వక్ సేన్. ఇందులో ఏమీ కొత్తదనం ప్రేక్షకులకు కన్పించదు. హీరో, ఆ హీరో చుట్టూ నలుగురు స్నేహితులు ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చి వెళ్ళాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది రొటీన్ కథ లాగే అనిపిస్తుంది. ఒరిజినల్ కథకు మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ఆకట్టుకునేలా తెరపై చూపించలేకపోయాడు దర్శకుడు. తెరపై ఎంతసేపు గొడవలు, బూతులు తిట్టుకోవడం, తాగడం, తిరగడం ఇవే కనబడుతూ ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తాయనే చెప్పొచ్చు.
కథానాయికల పాత్రలకూ ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఈ సినిమాలో అనవసరమైన సన్నివేశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. నటుడిగా పరవాలేదనిపించిన విశ్వక్ దర్శకుడిగా సక్సెస్ సాధించలేదనే చెప్పొచ్చు. కేవలం బోల్డ్ డైలాగ్స్ ను నమ్ముకొని సినిమా చేశారన్న భావన కలుగుతుంది. కెమెరామెన్ హైదరాబాద్ ఆర్కిటెక్చర్ తో పాటు ఇక్కడి బస్తీల పరిస్థితులను అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో చక్కగా తెరకెక్కించాడు. ఇక అసలు కథ విషయానికి వస్తే సినిమా కథ అంతా ఫలక్‌నుమా లోని దాస్ అనే కుర్రాడి చుట్టూనే తిరుగుతుంది. దాస్ చిన్నప్పట్నుంచి ఆ ఏరియా లోని శంకర్ అనే దాదాని చూసి పెరుగుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ గ్యాంగ్‌ని కూడా తయారు చేసుకుంటాడు. ఈ చోట గ్యాంగ్ కు శంకరన్న సపోర్ట్ కూడా ఇస్తాడు. స్కూల్ ఏజ్ లోనే శంకర్ గ్యాంగ్ తో తింటూ తిరుగుతూ సరదాగా గడిపేస్తుంటారు. కాలేజీలో అడుగుపెట్టాక ప్రేమ, గొడవలతో దాస్ జీవితం గడుస్తుండగా శంకర్ హత్యకు గురవుతాడు. రవి, రాజు అనే వ్యక్తులు శంకర్‌ను హత్య చేస్తారు.
శంకర్ హత్యతో గ్యాంగ్ ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు హాయిగా బతికిన ఈ గ్యాంగ్‌కు కష్టాలు మొదలవుతాయి. వాటి ముగింపు ఏంటి అనేదే సినిమా. క్లైమాక్స్ లో సుదీర్ఘ నిడివి ఉన్న ఓ సన్నివేశాన్ని ఒకే షాట్ లో తెరకెక్కించటం సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. నటులంతా సహజత్వాన్ని చూపించే ప్రయత్నం చేసినా..సినిమా కథలో బలం లేకపోవటం నిడివి మరీ ఎక్కువగా ఉండటంతో ఫలక్ నుమా దాస్ మూవీ నిరాశపర్చించిందనే చెప్పాలి. దర్శకుడి నుంచి నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ మాత్ర మంచి పాత్రలో కనిపించాడు. ఓ దర్శకుడు నటుడిగా మారితే ఎంతగా మెప్పించగలరో చూపించాడు. సైదులు పాత్రలో తరుణ్ జీవించాడనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాండు పాత్ర గురించి, ఉత్తేజ్ ఈ పాత్రను తన అనుభవంతో అవలీలగా చేసేసాడు.
రేటింగ్: 2/5