ఫలితాలకు ముందే ఓ ఏపీ మంత్రి ఇంటికి

Update: 2019-05-08 04:43 GMT

అదేంటి అనుకుంటున్నారా?. అవును. సాంకేతిక సమస్య. ఓ ఏపీ మంత్రి ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఓ వైపు మరో పక్షం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావాల్సిన సమయంలో ఈ పరిణామం విచిత్రమే. కానీ అనివార్యం. ఏపీ ప్రజల్లో ఫలితాల్లో ఏ ప్రభుత్వం వస్తుందనే ఉత్కంఠ మామూలుగా లేదు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధికారంలోకి వస్తుందనే ఎక్కువ మంది ధీమా వ్యక్తం చేస్తుంటే..లేదు..లేదు సంక్షేమ పథకాలే టీడీపీని మళ్ళీ గెలిపిస్తాయని ఆ పార్టీ సానుభూతిపరుల వాదన. ప్రజల తీర్పు ఎవరి పక్షమో మరికొన్ని రోజుల్లోనే ఈవీఎంలు దాటి బయటకు రానుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్‌ రాజీనామా ఒకట్రెండు రోజుల్లో రాజీనామా చేయాల్సి ఉంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

గత ఏడాది నవంబర్‌ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిడారి శ్రవణ్‌ కుమార్‌ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్‌ నరసింహన్‌ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్‌కు సమాచారం అందించారు. రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామా అనివార్యం కానుంది.

 

 

Similar News