చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్ ల ఘాటు లేఖ

Update: 2019-04-13 12:46 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఊహించని షాక్. ఏపీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ లు తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేదితో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఏ మాత్రం సరిగాలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎల్ వి సుబ్రమణ్యం ఎంతో మంచి పేరున్న అధికారి అని..ఆయనపై ఉన్న కేసులను హైకోర్టు కొట్టివేసిందని వీరు తమ తమ లేఖలో పేర్కొన్నారు. అయినా సరే చంద్రబాబు ఎల్ వి సుబ్రమణ్యాన్ని నిందితుడుగా పేర్కొనటం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు.

సీఎం భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండటంతో పాటు..తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కోరారు. సీఈవో ఆఫీసుకు వెళ్ళి చంద్రబాబు వ్యవహరించిన తీరు ప్రభుత్వ యంత్రాంగానికి ఎలాంటి సంకేతం పంపుతుందని ప్రశ్నించారు. ఈ లేఖ రాసిన వారిలో రిటైర్డ్ ఐఏఎస్ లు కె వి రావు, టి ఎస్ అప్పారావు, ఏకె పరీడా, ఎస్ కె సిన్హా, సుదీర్ధ భట్టాచార్య, విద్యాసాగర్, ఎం జీ గోపాల్, సీవీఎస్ కె శర్మ, వినోద్ అగర్వాల్, జె సి మొహంతి, ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ఉన్నారు.

 

 

 

Similar News