‘మజిలీ’ మూవీ రివ్యూ

Update: 2019-04-05 08:00 GMT

అక్కినేని నాగచౌతన్య కెరీర్ ను‘మజిలీ’ మలుపుతిప్పుతుందా?. ఎందుకంటే గత కొంత కాలంగా ఈ అక్కినేని హీరో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. పెళ్ళి అయిన తర్వాత నాగచైతన్య, సమంతలు కలసి చేసిన సినిమా కావటంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా మజిలీ సినిమా చాలా గ్యాప్ తర్వాత అక్కినేని నాగచైతన్యకు మంచి హిట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక సినిమా అసలు కథలోకి వస్తే ముందు ప్రేమించిన అమ్మాయి ఒకరు. కానీ అమ్మాయి తండ్రి అంగీకరించకపోవటంతో ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తే పరిస్థితి ఏంటి?. ఆ జీవితం ఎలా ముందుకు సాగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగే ఘర్షణ ఎలా ఉంటుంది. చివరకు పెళ్ళి చేసుకున్న భార్యతో ఆ వ్యక్తి ఎలా ఎలా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. అందుకు ప్రేరేపించిన సంఘటనలు ఏమిటి అన్నదే ‘మజిలీ’ కథ. ఇలాంటి కథలు గతంలో పలు సినిమాల్లో చూసినా కూడా ‘నిన్ను కోరి’ సినిమా దర్శకుడు శివ నిర్వాణ కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించటంలో విజయం సాధించారు. అక్కడక్కడ స్లో గా ఉన్నట్లు అన్పించినా..కొంత సమయం సరదాగా సాగే లవ్ ట్రాక్..తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళి చేసుకుని ఇష్టం లేని భార్యతో ఆ భర్త, భార్య పడే సంఘర్షణలు భావోద్వేగాలతో తెరకెక్కించారు దర్శకుడు. హీరో ఓ క్రికెట్ ప్రేమికుడు.

ఎలాగైనా రైల్వేస్ టీమ్ లో చోటు దక్కించుకోవటమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తాడు. ఆ సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమకు బ్రేకులు పడటం..చివరకు తన టార్గెట్ అయిన క్రికెట్ కు దూరం అయి..మందుకు బానిస అవుతాడు. ఆ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళి అవుతుంది. అయినా కూడా ఏ రోజూ హీరో..హీరోయిన్లు భార్యభర్తలు ఉండరు. ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రలో నాగచైతన్య మంచి మార్కులు కొట్టేస్తాడు. ఫస్ట్‌ హాఫ్‌లో యువకుడిగా ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్న చైతూ, సెకండ్‌ హాఫ్‌లో మధ్య వయసు వ్యక్తిగా సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌ తో మెప్పించాడు. తొలి పరిచయంలోనే దివ్యాంశ కౌశిక్‌ మంచి నటనతో ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్‌లోనే ఎంట్రీ ఇఛ్చిన సమంత తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌ లో సమంత నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్‌ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఫస్ట్ హాఫ్‌.. చైతూ, దివ్యాంశల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు, ఫ్రెండ్స్‌ తో కలిసి చైతూ చేసే అల్లరితో సరదాగా నడిపించిన దర్శకుడు, సెకం‍డ్‌ హాఫ్ అంతా ఎమోషనల్‌గా కథ నడిపించాడు. ఓవరాల్ గా ‘మజిలీ’ నాగచైతన్య కెరీర్ ను మలుపు తిప్పటం ఖాయంగా కన్పిస్తోంది.

రేటింగ్. 3/5

 

Similar News