జగన్ సహ నిందితుడిని సీఎస్ చేస్తారా?

Update: 2019-04-12 08:56 GMT

కేంద్ర ఎన్నికల సంఘంపై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తమ పరిపాలనా యంత్రాంగంలో జోక్యం చేసుకోవటానికి ఈసీ ఎవరు అని ప్రశ్నించారు. సీఎస్ పునేటాను తొలగించి...జగన్ కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న ఎల్ వి సుబ్రమణ్యాన్ని ఎలా సీఎస్ గా నియమిస్తారని ప్రశ్నించారు. గురువారం నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో సీఎస్ డీజీపీని కలవటాన్ని చంద్రబాబు ఆక్షేపించారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని కోవర్టు అని వ్యాఖ్యానించి చంద్రబాబు కలకలం రేపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించటంలో ఈసీ ఘోరంగా విఫలమైనా..ప్రతిపక్ష నేత జగన్ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదని..అందరూ కలసి కుట్రలు చేశారు కాబట్టే జగన్ మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో జరిగిన అల్లర్లు పక్కా పథకం ప్రకారమే జరిగాయని ఆరోపించారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మోడీతోపాటు కెసీఆర్, కరడు గట్టిన ఆర్ధిక ఉగ్రవాది అయిన జగన్ తో పోరాడాల్సి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వాళ్లు తమ అధికారాలు అన్నింటిని ఉపయోగించి రాష్ట్రాన్ని ఆణగదొక్కటానికి ప్రయత్నించారని విమర్శించారు. పోలింగ్ ప్రారంభం అయిన వెంటనే 31 శాతం ఈవీఎంలు పనిచేయలేదని..ఓ భయానక వాతావరణం కల్పించారని అన్నారు. ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఓటింగ్ లో పాల్గొన్నారని..వారందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తాను శనివారం ఢిల్లీ వెళుతున్నానని..అవసరం అయితే మంత్రులు..ఎంపీలతో కలసి ఢిల్లీలో ధర్నాకు కూడా దిగుతామని పేర్కొన్నారు. ఎందుకు ఏపీలో ఎన్నికల కమిషన్ ను అపహస్యం చేశారో సీఈసీని అడుగుతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీకి సైలంట్ వేవ్ ఉందని..జగన్ ను చూడా అంత మంది ఓటు వేయటానికి వస్తారా? అని ప్రశ్నించారు . తనపై నమ్మకం ఉంచి ప్రజలు టీడీపీకి ఓట్లు వేశారని తెలిపారు. జగన్ ఏపీని మరో బీహార్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో ఓటేస్తే నమ్మకం ఉండేదని..ఇప్పుడు అది పోయిందని అన్నారు.

 

Similar News