కోడెలపై కేసు నమోదు

Update: 2019-04-16 13:45 GMT

తెలుగుదేశం సీనియర్ నేత, సత్తెనపల్లి ఆ పార్టీ అభ్యర్ధి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు అయింది. ఎన్నికల రోజు ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి తలుపు వేయటం..పోలింగ్ కు అంతరాయం కలిగించటంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కేవలం వైసీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారని..ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శలు వస్తున్న తరుణంలో కోడెల పై పోలింగ్ అయిపోయిన ఐదు రోజుల తర్వాత కేసు పెట్టడం విశేషం. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల పోలింగ్ బూత్ లో కోడెల హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. కోడెలతోపాటు మరో 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కోడెల పోలింగ్ రోజున బూత్ లోకి వెళ్ళి తలుపు లు వేయగా..వైసీపీ నేతలు..కార్యకర్తలు వచ్చి తలుపులు తెరవాల్సిందిగా గొడవ చేశారు. చివరకు తలుపులు తీసి కొంత మంది ఆయన్ను బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఆయన చొక్కా చినగటంతో పాటు కింద పడిపోయారు. కోడెల పై కేసు పెట్టకపోతే నిరాహారదీక్షు దిగుతానని వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు హెచ్చరించారు. అంతే కాదు...పోలింగ్ రోజు జరిగిన ఘటనపై ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు ఐదు రోజుల తర్వాత కేసు నమోదు చేయటం గమనార్హం.

 

 

Similar News