అనిల్ చంద్ర పునేటా ఔట్

Update: 2019-04-06 04:12 GMT

కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాలను కాకుండా సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లు నడుచుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పైనే వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ బీ వెంకటేశ్వరరావును ఆ పదవి నుంచి తప్పించాలని సీఈసీ ఆదేశిస్తే ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ మరునాడే మళ్ళీ ఆయన్ను తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ మరో ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఈసీ ఆదేశాలను ధిక్కరించి ఏ బీ వెంకటేశ్వరరావును ఆ పోస్టులో తిరిగి నియమించమన్నది ఎవరు?. ఎవరు చెపితే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీపై హైకోర్టును ఆశ్రయించింది.

అంటే ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన సీఎస్ చంద్రబాబు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించినట్లు అయింది. దీంతో ఇలాగైతే ఎన్నికలు జరపటం కష్టం అని నిర్ణయానికి వచ్చిన ఈసీ సీఎస్ పై వేటు వేసి ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి ఛాన్స్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు.. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పునేఠాకు తదుపరి పోస్టింగ్‌పై తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో పేర్కొన్నారు.

Similar News