జగన్ ను టార్గెట్ చేసి చంద్రబాబును బుక్ చేసిన పవన్

Update: 2019-03-23 04:32 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనుకునేది ఒకటి. జరిగేది ఒకటి. ఆయన తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అటు ఇటు తిరిగి వచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మెడకే చుట్టుకున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. ‘ప్రతిపక్ష నేత బలంగా ఉంటే పాలకులు దోపిడీ చేసే వీలుండదు’. జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపిస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడే కదా?. మరి ఆయన ఘోరంగా వైఫల్యం చెందినట్లేగా?. అంతలా ఘోరంగా విఫలమైన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఈ లాజిక్ ను తెరపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో మద్దతు ఇఛ్చినట్లు?. అంటే ఓ ఫెయిల్యూర్ నేతకు తాను మద్దతు ఇచ్చినట్లు ఇప్పుడు అంగీకరిస్తున్నారా?. అంటే అప్పటికి ఆ లాజిక్ పుట్టలేదా?. ఇప్పుడే పుట్టిందా అది. ఈ లెక్కన వైఎస్ జమానాలో జరిగిన అవినీతిని అడ్డుకోవటంలో చంద్రబాబునాయుడు విఫలం అయ్యారని పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు అయింది. అంతే కాదు..అలాంటి అసమర్ధుడికి తాను మద్దతు ఇచ్చినట్లు కూడా ఒప్పుకున్నారు.

ప్రతిపక్షాలు బలంగా ఉంటే ప్రభుత్వంలో అవినీతి ఉండదు అనే పవన్ లాజిక్ ఎక్కడిదో మరి?. ఎక్కడా అలాంటి సందర్భాలు ఉన్న దాఖలాలు లేవు. ఓట్లు వేసే ముందు ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరులు..ఎవరెక్కువ పారదర్శక పాలన అందిస్తారో చూసి ఓటు వేయాలట. అలా చేస్తేనే పార్టీలు..ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాయని చెబుతున్నారు. ఈ లాజిక్ ను పవన్ ఎందుకు తెరపైకి తెచ్చారో ఊహించటం పెద్ద కష్టం కాబోదు. పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నారో ఈ వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కాల్షీట్ల ప్రకారం రాజకీయాలు చేసిన పవన్ భీమవరంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఫ్రస్ట్రేషన్ ను తెలియజేస్తున్నాయి. జగన్ తో పవన్ కు రాజకీయ వైరం ఉంటే ఉండొచ్చు. జగన్ పై ఎన్ని విమర్శలు అయినా చేసుకోవచ్చు. కడప జిల్లా పులివెందులో అందరూ రౌడీలే ఉన్నారా?. కొత్త తరహా రాజకీయాలు..బాధ్యతతో కూడిన రాజకీయాలు అని చెప్పే పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిన మాటలేనా? అవి. ఆయన మాటలు..ఎన్నికల ప్రచారం చూస్తుంటే పవన్ ‘రాజకీయం’ ఎవరి కోసమో కన్పిస్తూనే ఉంది. కొద్ది కాలం క్రితం వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో అవినీతి విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు వాటి ఊసెత్తటమే మానేశారు.

 

 

 

Similar News