సీపీఐకి పవన్ ‘వెన్నుపోటు’!

Update: 2019-03-24 06:07 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో దోస్తీ బాగానే ఒంటబట్టినట్లు ఉంది. ఒకప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా..ఏదో పైపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంత కాలం తాము వామపక్షాలతో కలసి ముందుకు సాగుతామని చెప్పిన జనసేనాని అత్యంత కీలకమైన సమయంలో మిత్రఫక్షం సీపీఐకి ‘వెన్నుపోటు’ పొడిచారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు ఏపీలో ఏ మాత్రం ఉనికే లేని బిఎస్పీకి భారీ ఎత్తున సీట్లు ఇచ్చిన జనసేన, సీపీఐ, సీపీఎంకు మాత్రం ఏదో నామమాత్రం సీట్లు విదిల్చారు. పోనీ వాటిలో అయినా సరిగా పోటీ చేయనిస్తున్నారా? అంటే అదీ లేదు. సీపీఐకి ఇఛ్చిన సీట్లలో ఆకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధులను ప్రకటించటంతో అవాక్కు అవవటం సీపీఐ నేతల వంతు అయింది. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జనసేన పలు చోట్ల అభ్యర్ధులను మార్పులు, చేర్పులు చేస్తూ సీపీఐని ఇరకాటంలోకి నెడుతోంది. ఈ పరిణామాలపై సీపీఐ కూడా గుర్రుగానే ఉంది. మరి ఒంటరిగా బరిలోకి దిగుతుందా..అయినా సరే జనసేనతో సర్దుబాటు చేసుకుంటుందా? అన్నది వేచిచూడాల్సిందే.

పవన్ కళ్యాణ్ వైఖరిపై రాజకీయంగా ఇఫ్పటికే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చర్యలు కూడా వాటిని మరింత బలపర్చేలా ఉన్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీ అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయనుకున్న చోట ఆఖరి నిమిషంలో జనసేన అభ్యర్థులను మార్చేస్తోంది. పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ స్థానాన్ని సీపీఐకి జనసేన కేటాయించింది. దాంతో సీపీఐ అభ్యర్థిగా చలసాని అజయ్‌ కుమార్‌ను సీపీఐ ఎంపిక చేసుకుంది. సోమవారం నామినేషన్ వేసేందుకు కూడా ఆయన సిద్దమయ్యారు. ఇంతలో హఠాత్తుగా జనసేన తన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాదబాబును ప్రకటించింది. దీంతో సీపీఐ షాక్ కు గురైంది. నూజివీడు స్థానంలోనూ జనసేన ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. తొలుత సీపీఐకి ఈ స్థానాన్ని కేటాయించారు. కానీ టీడీపీ కోసం తిరిగి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. ఇలాంటి పరిణామాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు రంగును బహిర్గతం చేస్తున్నాయనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నికల నాటికి రాజకీయంగా ఇంకా ఎన్ని సంచలనాలు నమోదు అవుతాయో వేచిచూడాల్సిందే.

 

Similar News