లోకేష్ నియోజకవర్గ నేతా..రాష్ట్ర నాయకుడా!?

Update: 2019-03-21 04:24 GMT

గత ఐదేళ్ళ కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా లోకేష్ ‘‘చక్రం’’ తిప్పారు. చాలా వరకూ పనులు ఆయన కనుసన్నల్లోనే సాగాయి. లోకేష్ ‘పవర్’ ఏంటో పలు సందర్భాల్లో సీనియర్ మంత్రులకూ తెలిసి వచ్చింది. అత్యంత కీలకమైన మంత్రివర్గ సబ్ కమిటీల్లోనూ సీనియర్లను కాదని లోకేష్ కే ప్రాధాన్యత ఇచ్చారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు. ప్రస్తుతం లోకేష్ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి తోపాటు రాష్ట్ర మంత్రి కూడా ఉన్న విషయయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత నారా లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు మంత్రి పదవి ఇఛ్చిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ ప్రస్తుతం ఒక్క నియోజకవర్గానికే పరిమితం అయిపోయారు. నిత్యం ‘మంగళగిరి’ చుట్టూనే తిరుగుతున్నారు తప్ప..ఇతర నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే మంగళగిరిలో ఆయన గెలవాలంటేనే చాలా కష్టపడాలి.

ఎందుకంటే ఈ ఐదేళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్న నారా లోకేష్ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ‘ఎంపిక’ చేసుకోలేకపోయారు. ఎందుకంటే అంతగా ఆయన ‘ప్రజాసేవ’లో మునిగిపోయారు మరి. ఆ ప్రజా సేవ ప్రభావమే ఇప్పుడు నారా లోకేష్ పై పడుతోంది. అత్యంత కీలకమైన రాజధాని ప్రాంతం ఉన్న నియోకవర్గం కావటంతో మంగళగిరి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ప్రచారానికి వస్తున్న స్పందన అంతంత మాత్రమే అయితే..కొన్ని చోట్ల ప్రజల నుంచి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా..టీడీపీ భవిష్యత్ నేతగా చెప్పుకునే లోకేష్ అత్యంత కీలకమైన ఎన్నికల్లో కేవలం ఒక నియోజకవర్గానికి...అది కూడా తాను పోటీ చేసే మంగళగిరికే పరిమితం అయితే ఏమి సంకేతం ఇస్తున్నట్లు?. అప్పుడు పార్టీలోని ఇతర నేతలకు...నారా లోకేష్ కు ఏమీ తేడా ఉన్నట్లు?.

 

Similar News