ఒక్కసారి అని క్రూర మృగం చెంతకు వెళ్తారా ఎవరైనా?

Update: 2019-03-31 06:01 GMT

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన దివారం నాడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్క సారి ప్లీజ్ అంటే క్రూర మృగం చెంతకు ఎవరైనా వెళ్తారా?. ఒక్కసారి కదా అని తెలిసి లోయలో ఎవరైనా దూకుతారా?. ఒక్కసారే కదా అని ఎవరైనా సైనైడ్ విషం తాగుతారా?. తప్పులు చేసేవాడికి ఎవరైనా ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? తండ్రికి ఛాన్సిస్తే ఉమ్మడి రాష్ట్రాన్ని ఏకంగా మింగేశాడు.ఇతనికి ఛాన్స్ ఇస్తే ఇక జనాన్ని బతకనిస్తాడా?.’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి-సంక్షేమంలో టిడిపితో, వైకాపా పోటిబడలేదని..అందుకే అరాచకాలకు, అల్లర్లకు వైకాపా బరితెగిస్తోందని విమర్శించారు.

రూ.లక్ష కోట్ల ఆస్తులు లాక్కున్న కెసిఆర్ తో జగన్ దోస్తీ చేస్తున్నారని, పోలవరంపై పదేపదే కేసులు వేసే టిఆర్ ఎస్ కు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులు, బంధువుల ఆస్తుల కోసం కెసిఆర్ కు రాష్ట్రం తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ‘కియా’పై మోదికి కితాబివ్వడం జగన్ మరో సెల్ఫ్ గోల్ అని వ్యాఖ్యానించారు. కియా క్రెడిట్ తనదే అని చెప్పే సాహసం మోడీయే చేయలేదు. అలాంటిది జగన్ ‘మోది భజన’ ఆ పార్టీ నేతలను కూడా మించిపోయిందన్నారు. అభివృద్ది-సంక్షేమం కొనసాగాలంటే టిడిపితోనే సాధ్యమని, టిడిపి మిషన్ 150ప్లస్ ఏకపక్షం కావాలన్నారు.

 

Similar News