ఫెడరల్ ఫ్రంట్ పోయింది..జాతీయ పార్టీ వచ్చింది

Update: 2019-03-18 04:03 GMT

కొద్ది రోజుల క్రితం వరకూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ అంటూ ఊదరగొట్టారు. హైదరాబాద్ లో కూర్చునే ఢిల్లీలో భూకంపం పుట్టిస్తామని వ్యాఖ్యానించారు. అంతే కాదు..తానూ అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేక విమానాలు తీసుకుని దేశమంతటా పర్యటిస్తామని తెలిపారు. కానీ అందులో ఏదీ ముందుకు జరగలేదు. కెసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కూడా పెద్దగా దక్కలేదు. ఒక్క వైసీపీ మాత్రం సూత్రప్రాయంగా కెసీఆర్ తో కలసి పనిచేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పుడు కెసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ను పక్కన పెట్టి ‘జాతీయ పార్టీ’ ప్రకటన చేశారు. అది కూడా ఎన్నికల తర్వాత అట. అవసరమైతే అడుగులు వేస్తా అంటున్నారు. అసలు అవసరం ఉందని ఎవరు తేల్చాలి?. ఎవరైనా పార్టీ పెడితే ఎన్నికలకు ఏడాది ముందో లేక ఎన్నికల సమయంలోనే పార్టీ పెట్టి తమ ఏజెండా బహిర్గతం చేసి ఎన్నికల బరిలో నిలుస్తారు. కానీ అందుకు భిన్నంగా ఎన్నికల పూర్తయిన తర్వాత అవసరం అయితే జాతీయ పార్టీ పెడతామని ప్రకటించటం వెనక మతలబు ఏమిటి?. అసలు దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఎన్నికల తర్వాత తమతో కలసి వచ్చే పార్టీలను కలుపుకుని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. కెసీఆర్ చెబుతున్నట్లు తెలంగాణలోని ఎంఐఎంకు ఒకటి పోను పదహారు సీట్లు టీఆర్ఎస్ కు వచ్చినా కేంద్రంలో ‘చక్రం’ తిప్పటం జరిగే పనేనా?. మహా అయితే ఆ సీట్లకు గాను అవసరమైన పార్టీ ఓ రెండు, మూడు మంత్రి పదవులు ఇస్తాయోమో. అంతే కానీ అంతకు మించి ‘జాతీయ ఏజెండా’ను ఫిక్స్ చేసే ఛాన్స్ కెసీఆర్ కు ఎవరు ఇస్తారు?. 16 సీట్లతో కెసీఆర్ అన్ని అద్బుతాలు చేయగలిగితే అంత కంటే ఎక్కువ సీట్లు ఉన్న వారు ఏమి చేస్తారు?. వాళ్లు కెసీఆర్ చెప్పినట్లే వింటూ కూర్చుంటారా?. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసమే కెసీఆర్ కొత్తగా ‘జాతీయ పార్టీ’ నినాదం అందుకున్నారని..ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో..అలాగే ఇది కూడా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

 

 

Similar News