ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఓ ప్రభంజనం. ఆయన పార్టీ ఏర్పాటు..గెలుపు ఓ సంచలనం. అప్పటికే రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత..ఎన్టీఆర్ ఇమేజ్ తోడై అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి అయ్యేలా చేశాయి. సినీ రంగంలో అడుగు పెట్టి ఎలా అగ్రహీరో స్థాయికి ఎదిగారో..రాజకీయ రంగంలోనూ ప్రవేశించిన అనతికాలంలోనే ఎన్నో ‘రికార్డు’లు నెలకొల్పారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాలను రెండు భాగాలుగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా కథానాయకుడు, మహానాయకుడుగా సినిమాల్లో నటించి..స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. కథానాయకుడు సినిమా పరంగా నీట్ గా ఉన్నా...ప్రేక్షకుల ఆదరణ పొందంటంలో మాత్రం విఫలమైంది. శుక్రవారం నాడు ‘మహానాయకుడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం..అడుగులు ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. మహానాయకుడు సినిమాను ఫస్టాఫ్ లో చూపించాల్సిన ఎన్టీఆర్ పుట్టుక..బాల్యంతో ప్రారంభించారు. తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జెండాను ఖరారు చేసిన విధానం దర్శకుడు క్రిష్ ఆకట్టుకునేలా చూపించారు.
ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించటంతో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వణుకు ప్రారంభం అవుతుంది. అందుకే ఎన్టీఆర్ ను దెబ్బకొట్టేందుకు షెడ్యూల్ కంటే ఎన్నికలను ముందుగా ప్రకటించి విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. అప్పటికి టీడీపీలో ఒక్కరంటే ఒక్క అభ్యర్ధి కూడా ఖరారు కాలేదు. అయినా సరే టీడీపీని ఎన్టీఆర్ ఒంటిచేత్తో ఎలా గెలిపించారు. మొదటి నుంచి ఎన్టీఆర్ కు తోడుగా నిలిచిన నాదెండ్ల భాస్కరరావు సిద్ధం చేసిన జాబితాను పక్కన పెట్టి..ఎన్టీఆర్ స్వయంగా అభ్యర్ధులను ఎంపిక చేయటం , ప్రచారం వంటి అంశాలను చూపించారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల తర్వాత ఆయన భార్య బసవతారకానికి క్యాన్సర్ అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉందని గుర్తించటం..ఎన్టీఆర్ కూడా బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళతారు. ఆ సమయంలో నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ పై తమ పనులు, పైరవీలు ఏమీ కావటంలేదని అసంతృప్తితో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్ అండతో అప్పటి గవర్నర్ రామ్ లాల్ సహకారంతో సీఎంగా బాధ్యతలు సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు..ఢిల్లీలో రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్..తిరిగి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో సినిమాను ముగించారు. ఈ సినిమాలో రాజకీయ అంశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో..అదే సమయంలో ఎన్టీఆర్, బసవతారకంల మధ్య అనుబంధాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో ఆవేశపరుడైన ఎన్టీఆర్ ను రెచ్చగొట్టి..పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని నాదెండ్ల భాస్కరరావు చేసిన ప్రయత్నాలు...ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌ను అవమానపరిచే సందర్భంలో ఎన్టీఆర్ గా బాలయ్య తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో బసవతారకం పాత్రను పోషించిన విద్యాబాలన్ తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశారని చెప్పొచ్చు. చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్ కేద్కర్‌లు ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ చంద్రబాబు పాత్రను ఎక్కువ ఎలివేట్ చేసినట్లు కన్పిస్తుంది. చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో నారా దేవాన్ష్ ను చూపించారు. మాటల రచయితగా సాయి మాధమ్ బుర్రా తన సత్తా చాటారు. ‘దారి కొత్తదే అయినా.. ఒక్కసారి అడుగు వేశాక.. దారి మన కిందే ఉండాలిగా’ వంటి మాటలు ఆకట్టుకున్నాయి. ఈ రెండు బయోపిక్ ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘మహానాయకుడి’ కంటే కథానాయకుడే బాగుందని చెప్పొచ్చు.
రేటింగ్. 2. 25/5