విపక్షాల ఐక్యత ఓ ‘కల్తీ’ వ్యవహారం

Update: 2019-02-07 16:02 GMT

దేశంలో విపక్షాల ఐక్యతను ‘కల్తీ’గా వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోడీని గద్దె దించేందుకు దేశంలోని 23 పార్టీలు ఏకమైన విషయం తెలిసిందే. ఇన్ని పార్టీలు కలసిన కల్తీ ప్రభుత్వం వస్తే ఏమి అవుతుందో ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇస్తూ ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ జమానాలో ప్రతి సారీ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరిందని తెలిపారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో మాత్రం ధరలను తగ్గించామని తెలిపారు. తమపై విమర్శలు చేయటానికి ఏమీ లేక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నామని ఆరోపిస్తున్నారని..కాంగ్రెస్ పార్టీ చేసినంతగా ఎవరైనా వ్యవస్థలను నాశనం చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులను హరించడం.. రాజకీయం కోసం రాష్ట్రపతి పాలన పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

దేశాన్ని సర్వశక్తివంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. నెహ్రూ, ఇందిరా హయాంలో.. కేరళ, బెంగాల్‌ హక్కుల్ని కాలరాశారని మోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను కూడా కాంగ్రెస్‌ అలాగే కూలదోసిందన్నారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఎంత పనిచేస్తుందో చూపించామని, అందుకే భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామన్నారు. ఎన్నడూలేని రీతిలో తాము ప్రజలకు నీతివంతమైన పాలన అందించామని తెలిపారు. దేశంలో తొలిసారి ఓటు వేసే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో తాము అసలు జోక్యం చేసుకోలేదని..కాంగ్రెస్ పార్టీ మాత్రం న్యాయవ్యవస్థను భయపెట్టేలా చేస్తోందని విమర్శించారు. రఫెల్ పై కాంగ్రెస్ విమర్శలను మోడీ తోసిపుచ్చారు. సైన్యం సామర్ధ్యం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

Similar News