‘కోడ్’ కూత మొదలు..ఏపీ సర్కారులో టెన్షన్

Update: 2019-02-18 14:45 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కొత్తగా ఎలాంటి పనులు చేపట్టానికి వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడింది. ఈ ఎన్నికలు పూర్తి కాక ముందే లోక్ సభ సార్వత్రిక, ఏపీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడనుంది. సో..ఈ ఎన్నికల కోడ్ మే నెల వరకూ కొనసాగనుంది. అయితే ఇప్పుడు ఏపీ సర్కారు కొత్తగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ ఖాతాల్లోకి తొలి విడత నిధులు చేరాయా?. లేదా?. చేరకపోతే పరిస్థితి ఏంటి?. మరి ఎన్నికల కమిషన్ ఈ స్కీమ్ ను పాత స్కీమ్ గా పరిగణిస్తుందా? లేక ఎన్నికల వరకూ దీనికి బ్రేకులు వేస్తుందా?. వేచిచూడాల్సిందే. ఏపీ సర్కారులో ప్రస్తుతం ఇదే టెన్షన్ నెలకొంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. మార్చి 12న పోలింగ్‌ జరగనుంది. మార్చి1 నుంచి నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణకు మార్చి5న తుదిగడువుగా నిర్ణయించారు. పోలింగ్‌ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీ మండలి నుంచి పి.నారాయణ, ఎ.లక్ష్మీశివకుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు రిటైరవుతుండగా.. తెలంగాణ శాసన మండలి నుంచి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, టీ. సంతోష్‌కుమార్‌, మహ్మద్‌ సలీమ్‌, మహముద్‌ అలీలు తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు.

 

Similar News