రంగా హత్యతో టీడీపీకి సంబంధం లేదు

Update: 2019-01-24 07:44 GMT

ఈ మాట అన్నది ఎవరో తెలుసా?. సాక్ష్యాత్తూ ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. కొంత మంది వ్యక్తులు చేసిన పనిని పార్టీకి ఆపాదించటం సరికాదన్నారు. రంగాను అభిమానించే వాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన తొలిసారి గురువారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు బుధవారం రాధా నివాసానికి వెళ్లి మరీ టీడీపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వైసీపీలో తనకు జరిగిన అవమానాలు మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. రంగా విగ్రహావిష్కరణకు వెళ్తె ఎవరికి చెప్పి వెళ్లావని ప్రశ్నించారని..తన తండ్రి విగ్రహా కార్యక్రమానికి ఎవరికి చెప్పి వెళ్లాలని ప్రశ్నించారు.

ఆంక్షల మధ్య ఉండలేకే బయటకు వచ్చానని అన్నారు. తండ్రి లేని వాడని ఆదరించానని..చెప్పినట్లు వినాల్సిందేనని జగన్ అన్నారని తెలిపారు. ఏకంగా కొంత మంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు రాధా. తాను ఏ నిర్ణయం తీసుకోకముందే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు తనపై దాడి ప్రారంభించారని..ఇలాంటి దాడులకు తాను భయపడబోనని తెలిపారు. ప్రశ్నలు అడిగిన మీడియాపై కూడా రాధా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీ రేటింగ్ లు పెంచుకునేందుకు ఏది పడితే అది మాట్లాడొద్దని హెచ్చరిక స్వరంతో మాట్లాడారు. తనకు రంగా ఆశయాలు నెరవేర్చటం తప్ప ఏదీ ముఖ్యంకాదన్నారు.

 

Similar News