వైసీపీలో టెన్షన్ టెన్షన్!

Update: 2019-01-16 04:45 GMT

ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారు. ఇదే ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు టెన్షన్ కు కారణం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేతలతో ఏపీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ఏమైనా ప్రభావం చూపుతుందా? అన్న భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. పెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తన తరపున టీమ్ ను పంపిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తోపాటు వినోద్, పల్లా రాజేశ్వరర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కెసీఆర్ చెబుతున్నారు. ఈ సమావేశం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని..అయితే జగన్ ప్రకటన ఎలా ఉంటుందనేది అత్యంత కీలకం కాబోతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అందరితో సమావేశం అవుతున్నట్లు తమ పార్టీ నేతతో కూడా సమావేశం అయ్యారని..దీనికి ఏమీ ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ ఉండకపోవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు అయినా సరే ఎన్నికల ఫలితాల తర్వాతే అని ప్రకటిస్తే ఓకే కానీ...కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో కలసి ముందుకు సాగుతామని ప్రకటిస్తే అది ఖచ్చితంగా వైసీపీపై ప్రభావం చూపటం ఖాయం అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కూడా ఇప్పటివరకూ ఒక రూపు సంతరించుకోలేదు. అందులో ఎవరు ఉంటారో..ఎవరు ఉండరో కూడా తెలియని పరిస్థితి. ఈ దశలో జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుంది?. అన్నది ఆ పార్టీ నేతల టెన్షన్. చూడాలి ఈ భేటీ తర్వాత ఎలాంటి ప్రకటనలు వస్తాయో.

Similar News