ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు

Update: 2019-01-23 07:41 GMT

సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ చెప్పిన ప్రియాంక గాంధీని నేరుగా బరిలోకి దింపారు. అది కూడా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ఆమెకు బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షలు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత బాధ్యతలు ఆమెకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ పరంగా అత్యంత కీలకమైన అడుగుగా చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేయగా..ఎస్పీ, బిఎస్పీలు మాత్రమే జట్టుకట్టాయి.

కాంగ్రెస్ కు అంత బలంలేదని..అందుకే ఎలాంటి సీట్లు కేటాయించలేదని ఆ పార్టీలు ప్రకటించాయి. ఈ తరుణంలో రాహుల్ గాంధీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియాంకతోపాటు కె సి వేణుగోపాల్ ను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక ఏఐసిసి ఇన్ ఛార్జి పదవిలో కొనసాగుతూనే ఈ బాధ్యతలు చూస్తారు. జ్యోతిరాధిత్య సింథియాకు కూడా ఉత్తర ప్రదేశ్ పశ్చిమ బాధ్యతలు కేటాయించారు. గులాంనబీ ఆజాద్ ను హర్యానా బాధ్యతలు చూస్తారు. ప్రియాంక గాంధీ ఫిబ్రవరి మొదటి వారంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆమెను కేవలం ఉత్తరప్రదేశ్ కు మాత్రమే పరిమితం చేస్తారా?. దేశమంతటా కూడా ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.

Similar News