‘పేట’ మూవీ రివ్యూ

Update: 2019-01-10 16:01 GMT

రజనీకాంత్ ఈ మధ్య కాలంలో తడబడుతున్నాడు. ఒకప్పటిలా సూపర్ హిట్లు అందుకోలేకపోతున్నాడు. చాలా వరకూ సినిమాలు ఓకే అన్పిస్తున్నా..రజనీ మార్క్ సక్సెస్ లు మాత్రం గత కొంత కాలంగా లేవనే చెప్పొచ్చు. తాజాగా ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ పేట అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమా కథలో దమ్ములేకపోయినా..రొటీన్ కథే అయినా...రజనీకాంత్ విశ్వరూపం చూడాలనుకునే వారికి మాత్రం ‘పేట’ నచ్చుతుందనే చెప్పొచ్చు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇది ఓ రొటీన్ ఫార్ములా సినిమానే. రజనీకాంత్ కూడా అందరి హీరోల్లానే ఏదో సినిమాలు చేయాలి కాబట్టి చేస్తూ పోతున్నట్లు ఆయన గత కొంత కాలంగా చేస్తున్న సినిమాలు చూస్తుంటే అర్థం అవుతుంది. 2.ఓ సినిమా తర్వాత వచ్చిందే ఈ పేట. సినిమాలో రజనీకాంత్ లవ్ ట్రాక్, యువకుడిలా హుషారుగా నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పేట సినిమాలో రజనీకాంత్ ఓ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. అక్కడే ప్రాణిక్‌ హీలర్‌గా పనిచేసే డాక్టర్‌(సిమ్రన్‌)తో కాళీకి పరిచయం అవుతుంది.

అలా సరదగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్‌ రౌడీతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా కాళీ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్‌ నుంచి అక్కడకు వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ)కు, పేటకు మధ్య గొడవ ఏంటి.? సన్నివేశాలతో సినిమా ముందుకు సాగుతుంది. ఈ సినిమాలో రజనీకాంత్ మరోసారి తనదైన స్టైలిష్‌, మాస్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌ ఉన్నా ఎవరికీ పెద్దగా ప్రాదాన్యం లేదు. ప్రతినాయక పాత్రలను కూడా అంత బలంగా తీర్చి దిద్దకపోవటంతో విజయ్‌ సేతుపతి, నవాజుద్ధిన్‌ సిద్ధిఖీ లాంటి నటులు ఉన్నా ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందనే చెప్పొచ్చు.

సినిమా అంతా రజనీ వన్‌మేన్‌ షోలా సాగటంతో ఇతర పాత్రలు గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. శశికుమార్‌, బాబీ సింహా, మేఘా ఆకాష్‌, నాగ్‌ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. పేట సినిమా పక్కా కమర్షియల్‌ ఫార్ములాతో తెరకెక్కింది. రజనీకాంత్ గతంలో ఇలాంటి సినిమాలు చేశాడు. తొలి భాగానికి ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌ లతో నడిపించిన దర్శకుడు కార్తీక్‌, ద్వితీయార్థంలో కాస్త తడబడ్డాడు. రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో కొత్తదనం ఏమీ లేదు. పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించటం కూడా తెలుగు ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇది రజనీకాంత్ అభిమానులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు.

రేటింగ్. 2.5/5

 

Similar News