పవన్ కళ్యాణ్ ‘ప్రతిపక్షం’పై పోరాటం చేస్తారా?

Update: 2019-01-16 04:32 GMT

ప్రచారంలో ఉన్నట్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎవరైనా సహజంగా అధికారంలోకి రావాలనుకుంటే పవర్ లో ఉన్న పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపుతారు. ప్రతిపక్షం కూడా తమ రాజకీయ ప్రత్యర్ధే కాబట్టి ఆ పార్టీని విమర్శించటం తప్పేమీ కాదు. కానీ విచిత్రంగా పవన్ కళ్యాణ్ అధికార పార్టీని వదిలేసి పదే పదే అధికార పార్టీ కంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్న తీరు చివరకు జనసేన అభిమానుల్లోనూ పలు సందేహాలు లేవనెత్తుతోంది. చంద్రబాబుపై ఉన్న కోపంతో కెసీఆర్ జగన్ ద్వారా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఇది కేవలం తెలుగుదేశం కోణంలో చేసిన ప్రకటనగా స్పష్టంగా కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని..ఎమ్మెల్యేలు కూడా వందల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.

ఈ మాటలు వాస్తవాలు అని చెప్పారా?. లేక అధికారంలోకి రావటం కోసం అని చెప్పారా?. ఏది నిజం?. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సహజంగా తాము అధికారంలోకి రావటానికి అందుబాటులో ఉన్న వనరులు అన్ని ఉపయోగించకుంటుంది. జగన్ తనతో పొత్తు కోసం టీఆర్ఎస్ నేతల ద్వారా రాయభారాలు నడిపిస్తున్నారని మరో ప్రకటన చేశారు పవన్. ఓ వైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు జనసేనతో కలిసే ప్రసక్తేలేదని బహిరంగంగానే చెబుతున్నారు. మరి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్న టీఆర్ఎస్ నేతలతో పవన్ అసలు ఎందుకు చర్చలు జరుపుతున్నట్లు?. ఎప్పుడైతే చంద్రబాబు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనతో కలసి రావాలని కోరిన దగ్గర నుంచి జనసేనాని వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

అప్పటి నుంచి చంద్రబాబు, నారా లోకేష్ పై విమర్శలు మానేసి..ప్రతిపక్షాన్ని ఎక్కువ టార్గెట్ చేయటం ప్రారంభించారు. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ స్కామ్ పై నాలుగు రోజులు హడావుడి చేసిన పవన్ ..తాజాగా అమరావతిలో ఇదే లోకేష్ కు చెందిన ఐటి శాఖ కార్వీ సంస్థకు అవసరం లేకపోయినా 64 కోట్ల రూపాయల విలువ చేసే 16 ఎకరాలు అప్పనంగా అప్పగించినా కనీసం పవన్ నోరుతెరిచి మాట్లాడటం లేదు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే పవన్ సొంతంగా తాను గెలవటం కంటే చంద్రబాబు గెలుపు కోసం తాపత్రయపడుతున్నట్లే ఎక్కువ కన్పిస్తోంది.

 

 

Similar News