రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

Update: 2019-01-10 05:04 GMT

మోడీ మాస్టర్ స్ట్రోక్ ఫలించింది. అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును అతి తక్కువ సమయంలో ఆమోదింపచేసుకోవటం ద్వారా కూడా ఆయన రికార్డు సృష్టించారు. ఇంత తొందరగా బిల్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారంటూ విపక్షాలు అభ్యంతరాలు చెప్పిన అధికార బిజెపి మాత్రం తాను అనుకున్నట్లే ముందుకెళ్లింది. దీంతో ముందు లోక్ సభలో..తర్వాత రాజ్యసభలో అగ్రవర్ణాల్లోని పేదలకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో పది రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఆమోదం పొందింది.

ఈ బిల్లుకు రాజ్యసభ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 165 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 172 మంది సభ్యులున్నారు. బిల్లుకు దాదాపు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు అమల్లోకి వస్తుంది. వచ్చే ఎన్నికల కోసం రాజకీయ అస్త్రంగా మోడీ ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో విపక్షాలు అన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే షాక్ కు గురయ్యాయని చెప్పొచ్చు.

Similar News