‘ఎట్ హోం’లో అందరి దృష్టి కెసీఆర్..పవన్ పైనే!

Update: 2019-01-26 14:07 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారు?. లేదంటే అన్ని సీట్లకు సొంతంగానే పోటీ చేస్తారా?. వైసీపీతో పొత్తుకు టీఆర్ఎస్ నేతలతో ఒత్తిడి చేస్తున్నారని ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ . ఇందులో నిజం ఎంత?. ఆ నేతలు ఎవరో చెప్పాలని వైసీపీ ప్రశ్నించింది. కానీ పవన్ నుంచి మౌనమే సమాధానం అయింది. కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కెసీఆర్ కూడా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి ప్రచారం చేసిన చంద్రబాబుకు ‘రిటర్న్ గిఫ్ట్ ఇష్తానని ప్రకటించారు. మరి ఈ రిటర్న్ గిఫ్ట్ ఏ రూపంలో ఉంటుంది అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఎట్ హోం సమావేశంలో అటు కెసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తో ఎక్కువ సేపు చర్చలు జరపటం ఆసక్తికర పరిణామంగా మారింది. అయితే వీరి మధ్య జరిగిన చర్చలు ఏమిటీ అన్నది ఎవరికీ తెలియదు. వీరి కలయిక మాత్రం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్న కెసీఆర్, కెటీఆర్ లు ఈ అంశం ఏమైనా పవన్ తో మాట్లాడి ఉంటారా? అనే చర్చ కూడా సాగుతోంది. గుంటూరు సభ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ఆ విమర్శల స్పీడ్ తగ్గించారు. ఎన్నికల వేళకు టీడీపీ, జనసేనల మధ్య మళ్ళీ పొత్తు చిగురించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ ఎంపీ టీ జీ వెంకటేష్ కూడా ఇదే విషయాన్ని ఈ మధ్య బహిరంగంగానే చెప్పారు. టీ జీ వెంకటేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్...అసలు పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పకపోవటం విశేషం. రాబోయే రోజుల్లో ఈ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయయో వేచిచూడాల్సిందే.

 

 

 

 

Similar News