సంక్రాంతి అంటే కోడి పందేలు ఎంత కామనో..సినిమా పోటీ కూడా అంతే కామన్. ఈ సంక్రాంతి బరిలో కూడా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు..మరోకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శనివారం నాడు విడుదలైన ‘ఎఫ్ 2’ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో సంక్రాంతి సినిమా సందడికి బ్రేక్. అయితే సంక్రాంతి బరిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి..మొదటి స్థానంలో నిలిచిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఎఫ్ 2 అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. వెంకటేష్. వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అసలైన సంక్రాంతి సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా. వరుణ్ తేజ్ కు జోడీగా మెహరీన్ నటించారు. హీరో వెంకటేష్ ఓ ఎమ్మెల్యే దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. కానీ ఎమ్మెల్యేనే ఇంటికొచ్చి మరీ పీఏను రోజూ తన వాహనంలో ఎక్కించుకుని పోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఈయన ఎమ్మెల్యే పీఏ అని చెబుతారు. కానీ వెంకటేష్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. అటు వెంకటేష్, ఇటు తమన్నా పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తారు. అబ్బాయికి ఆడపడుచులు..అత్త మామలు ఎవరూ లేరని తెలియటంతో తమన్నా వెంటనే వెంకటేష్ తో పెళ్ళికి అంగీకరిస్తుంది.
అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సినిమా. ప్రతి ఒక్కరూ తానొక్కడినే భార్యను కంట్రోల్ పెడతాననే నమ్మకంతో ఉంటారు. కానీ వాస్తవంగా ఏమి జరుగుతుంది అన్నదే సినిమా. వెంకటేష్ మరదలే మెహరీన్. వరుణ్ తేజ్, మెహరీన్ ప్రేమకు రెండు కుటుంబాల మధ్య వివాదాలు పెళ్ళి దశలో బ్రేక్ వేస్తాయి. సినిమా ఫస్టాఫ్ అంతా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఏ మాత్రం గ్యాప్ లేకుండా నవ్విస్తాడు. భార్యల వేధింపులు..భర్తల కష్టాల కామెడీతో సినిమా సరద సరదాగా సాగిపోతుంది. చివరకు ఇంట్లోకి ఎవరు వచ్చినా కరిచే కుక్క కూడా వెంకటేష్ కష్టాలు విని వదిలేస్తుందంటే సీన్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ‘పగోడివి అయినా మగాడివి కాబట్టి’ నీకు ఓ సలహా చెబుతున్న వంటి డైలాగ్ లు సినిమాలో ఎన్నో.
భార్య ఏమి చెప్పినా నిత్యం ‘అంతేగా...అంతేగా.’ అంటూ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. హానీ గా మెహరీన్ చలాకీ పాత్రలో ఆకట్టుకుంది. ఇంత కాలం రొటీన్ సినిమాల్లో చేసిన మెహరీన్ ఈ సినిమాలో మాత్రం మంచి పాత్ర దక్కించుకుంది. ఫస్టాఫ్ అంతా పూర్తి స్థాయి..గ్యాప్ లేని కామెడీతో సాగిపోయిన సినిమా సెకండాఫ్ లో కాస్త స్లో అయినట్లు అన్పిస్తుంది. అయినా సరే సరదా మాత్రం కంటిన్యూ అవుతుంది. సినిమాలో ఇద్దరు హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఉన్నా...‘షో’ అంతా వెంకటేషే నడిపించినట్లు అన్పిస్తుంది. అయినా ఈ కామెడీ సబ్జెక్ట్ కు వెంటకేష్, వరుణ్ తేజ్ లు ఇద్దరూ సరిగ్గా సెట్ అయినట్లు అన్పిస్తుంది. సంక్రాంతి బరిలో నిలిచిన అసలైన ‘పండగ సినిమా’ ఇదే అని చెప్పొచ్చు.
రేటింగ్. 3.25/5