అంబానీ కూతురి పెళ్ళి..ముంబయ్ ఎయిర్ పోర్టు రికార్డు

Update: 2018-12-13 04:23 GMT

ముంబయ్ విమానాశ్రయానికి ...అంబానీ కూతురి పెళ్లికి లింక్ ఏంటి? అంటారా?. ఈ పెళ్లి కారణంగా ముంబయ్ లోని చత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయం తన రికార్డును తానే తిరగరాసుకుంది. ఒక్కరోజులో ఏకంగా 1007 విమానాలను హ్యాండిల్ చేయటం ద్వారా ఈ ఫీట్ సాధించింది. ఇప్పటివరకూ ముంబయ్ విమానాశ్రయంలో ఒక్క రోజులో సాగించిన విమానరాకపోకలు 1003 మాత్రమే. అయితే ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లి కారణంగా పలువురు పారిశ్రామికవేత్తలు..వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ప్రత్యేక విమానాల్లో ముంబయ్ కి తరలివచ్చారు.

దీంతో ఈ విమానాశ్రయం కొత్త రికార్డును నమోదు చేసినట్లు అయింది. ముంబయ్ విమానాశ్రయంలో రెండు ముఖ్యమైన రెండు క్రాసింగ్ రన్ వేలు ఉన్నాయి. ప్రధాన రన్ వేలో గంటకు 48 విమానాలకు రాకపోకలకు అవకాశం ఉంటుంది. సెకండరీ రన్ వేలో మాత్రం గంటకు 35 విమానాల రాకపోకలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 2018 మార్చితో ముగిసిన కాలానికి ముంబయ్ విమానాశ్రయం 48.49 మిలియన్ ప్యాసింజర్లను హ్యాండిల్ చేసింది. ఈషా అంబానీ పెళ్ళికి ఏకంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ఓ అంచనా.

 

Similar News