తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Update: 2018-12-28 04:19 GMT

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాను అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకుంటుంది. అందులో భాగంగా ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన తలాఖ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు జాయింట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల వినతిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్‌ చేశాయి. తాజా బిల్లుతో ఇంతకు ముందే లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది. దీంతో ఏడాది వ్యవధిలో ఒకే బిల్లు రెండుసార్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లయింది. ఇక తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్ళాల్సి ఉంది. అక్కడ కూడా గట్టెక్కి రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రూపొందించారన్న విపక్షాల వాదనల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఆర్డినెన్స్‌ స్థానంలో ఈ నెల 17నే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, గురువారం సభ పరిశీలనకు వచ్చింది.

ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లులోని పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మరింత అధ్యయనం నిమిత్తం బిల్లును జాయింట్‌ సెలక్ట్‌ కమిటీకి పంపాలని విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఇలాంటి బిల్లుపై లోక్‌సభ ఇది వరకే చర్చించి ఆమోదం తెలిపిందని, కాబట్టి ఇంకా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిని చర్చించాలి కానీ హఠాత్తుగా బిల్లును మరో కమిటీకి పంపాలని కోరొద్దని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ్యులకు సూచించారు. తాజా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, పలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.

 

 

Similar News